రామాయంపేట(మెదక్): కార్పొరేట్ వ్యాపారుల వైఖరితో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపిస్తూ చికెన్ సెంటర్ల వ్యాపారులు గురువారం నుంచి రెండు రోజుల పాటు బంద్ పాటించనున్నారు. ఈ సందర్భంగా చికెన్ సెంటర్ల అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మాట్లాడారు. కోళ్ల ఫారాలను సామూహికంగా లీజుకు తీసుకొని రైతాంగాన్ని దెబ్బతీసిన కార్పొరేట్ సంస్థల కన్ను ఇప్పుడు చికెన్ సెంటర్లపై పడిందని ఆరోపించారు. అమాంతం ధరలు పెంచిన రూ. కోట్ల లాభాలు గడిస్తూ రైతులతో పాటు తమనూ నష్టాల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ కోళ్ల ఫారాలపై దృష్టి సారించిన కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు చికెన్ సెంటర్లు నెలకొల్పుతున్నారని, దీంతో తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. వారి వైఖరి మారకపోతే సామూహికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు.


