న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ పాలనాయంత్రాంగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. మాల్దాలో జుడీషియల్ అధికారుల ఘెరావ్ ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇది ఆకస్మికంగా జరిగిన అల్లరి కాదని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని పేర్కొంది.
ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది కోర్టు అధికారానికే సవాల్ విసిరేలా ఉంది. ఎన్నికల విధుల్లో ఉన్న న్యాయాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు, అలాగే ఈ ప్రక్రియను స్తంభింపజేసేందుకే అత్యంత తెలివిగా ఈ వ్యూహాన్ని అమలు చేశారు’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ను దేశంలోనే ‘మోస్ట్ పోలరైజ్డ్ స్టేట్’(రెండు పరస్పర విరుద్ధ వర్గాలుగా విడిపోయిన రాష్ట్రం)గా అభివర్ణించింది.
ఈ వ్యవహారంలో పరిపాలనా విభాగం తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 3:30 గంటలకే ఘెరావ్ ప్రారంభమైనట్లు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సమాచారం అందినప్పటికీ, అధికారులు గంటల తరబడి స్పందించలేదని కోర్టు తప్పుబట్టింది. ‘రాత్రి 8:30 వరకు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా రంగంలోకి దిగి డీజీపీ, హోం సెక్రటరీలతో గ్రూప్ కాల్ మాట్లాడితే తప్ప హామీ రాలేదు. తీరా హామీ ఇచ్చాక కూడా క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలేమీ లేవు’ అని సీజేఐ మండిపడ్డారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ అక్కడికి చేరుకోకపోవడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, ఇది న్యాయవ్యవస్థను భయభ్రాంతులకు గురిచేసే చర్య అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: ‘పాక్‌ను సముద్రంలో కలిపేవాళ్లం’: నేవీ చీఫ్


