‘బెయిల్ మీ ఇష్టమా?’.. కింది బెంచ్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం | SC Drops A Bombshell: Slams Lower Benches for Denying Bail in UAPA Cases | Sakshi
Sakshi News home page

‘బెయిల్ మీ ఇష్టమా?’.. కింది బెంచ్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

May 18 2026 1:43 PM | Updated on May 18 2026 2:51 PM

SC Drops A Bombshell: Slams Lower Benches for Denying Bail in UAPA Cases

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో సంచలనం రేకెత్తించేలా భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) అంటే ‘ఉపా’ (UAPA) చట్టం కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ పొందడం ఒక నియమం’ అని, విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఉమర్‌ ఖాలిద్‌కు బెయిల్‌ దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో ‘కేఏ నజీబ్’ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది బెంచ్‌లు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు, దిగువ బెంచ్‌లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు జడ్జిల బెంచ్‌ ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో పెద్ద బెంచ్‌ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. పెద్ద ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న బెంచ్‌లు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా చెప్పింది.

విస్తృత ధర్మాసనం తీర్పులను ధిక్కరిస్తారా?
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024లో వెలువడిన ‘గుర్విందర్ సింగ్’, ఉమర్ ఖాలిద్ కు సంబంధించిన ‘గుల్ఫిషా ఫాతిమా’ కేసుల్లో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కేఏ నజీబ్’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్‌లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.

‘ఉపా’ కేసుల్లోనూ బెయిల్ ప్రాథమిక హక్కే
ఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం.. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ 43D(5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో, నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్లే అవుతుందని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.

ఆరేళ్ల జైలు జీవితం: సయ్యద్ ఇఫ్తిఖర్ కు విముక్తి
మాదకద్రవ్యాల సరఫరా ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ముకశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టులు, హైకోర్టు ఇతనికి బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం అతని సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఉపా కేసుల్లో నేరం రుజువయ్యే శాతం చాలా తక్కువగా ఉందని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా  గుర్తుచేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి: మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement