ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..! | IPL Suspension On The Cards? Narendra Modi Government Receives Crisis Demand | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!

May 17 2026 2:42 PM | Updated on May 17 2026 3:14 PM

IPL Suspension On The Cards? Narendra Modi Government Receives Crisis Demand

ఐపీఎల్‌ 2026 సీజన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రాన్ని జపించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్‌ బాఘేల్‌ తాజాగా స్పందించారు. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేస్తూ.. ఐపీఎల్‌ను వెంటనే నిలిపివేయాలని మోదీని కోరారు. స్టేడియాలకు వేలాది మంది అభిమానులు ప్రయాణించడం వల్ల భారీగా ఇంధనం వినియోగమవుతోందని, విదేశీ ఆటగాళ్లకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయని, బెట్టింగ్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

"ప్రధానమంత్రి గారు, వెంటనే ఐపీఎల్‌ను ఆపేయండి. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. విదేశీ కరెన్సీ చెల్లింపులు తగ్గుతాయి. బెట్టింగ్ కూడా ఆగుతుంది" అంటూ బాఘేల్ తన పోస్టులో రాసుకొచ్చారు.

బాఘేల్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. నెటిజన్లు బాఘేల్‌ వర్షన్‌ను సమర్దిస్తూ ఐపీఎల్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మోదీ కేవలం మాటలకే పరిమితం కాకుండా పొదుపు మంత్రాన్ని ఆచరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై నెట్టింట డిబేట్లు నడుస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఐపీఎల్‌ నిర్వహకులు నుండి గానీ ఎలాంటి స్పందన లేదు.

కాగా, దేశంలో ఇటీవల పెట్రోల్‌, డీజిల్, సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఈ పెంపు మరింత ఎక్కువ కానుందన్న సంకేతాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో ఇంధనంతో ముడిపడి ఉన్న ఐపీఎల్‌ను కొనసాగించడం​ సబబు కాదని సగటు భారతీయుడు అభిప్రాయపడుతున్నాడు.

మరోపక్క ఇంకో వర్షన్‌ కూడా వినిపిస్తుంది. టోర్నీ ముగియడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఈ దశలో సస్పెండ్ చేస్తే భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ ఆదాయం, ఫ్రాంచైజీల వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement