ట్రంప్‌ హెచ్చరిక.. ఇరాన్‌ ఆసక్తికర సందేశం విడుదల | Iran Supreme Leader Mojtaba Khamenei Key Statement On Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ హెచ్చరిక.. ఇరాన్‌ ఆసక్తికర సందేశం విడుదల

Apr 2 2026 11:05 AM | Updated on Apr 2 2026 11:42 AM

Iran Supreme Leader Mojtaba Khamenei Key Statement On Trump

టెహ్రాన్‌: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు. ఇరాన్‌లో విధ్వంసం జరిగిందని, ఇరాన్‌ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్‌ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. 

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ డే, ఇరాన్‌ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్‌ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్‌లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్‌ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్‌ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో ఇరాన్‌లోని మినాబ్‌ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్‌ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.

మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్‌ పాలనలో ‘అమెరికా ఫస్ట్‌’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement