దుబ్బాకటౌన్: యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. బుధవారం రాయపోల్ మండలంలోని తిమ్మక్‌పల్లి గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 16 సీసీ కెమెరాలు ప్రారంభించి, పెద్దమ్మ దేవాలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో క్రీడా పోటీలను ప్రారంభించి, విద్యార్థులకు నోట్‌బుక్స్, పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఆయేషా, గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ లతీఫ్, ఎస్‌ఐ మానస, సర్పంచ్ అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, ప్రధానోపాధ్యాయుడు నవీన్ కుమార్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.


