'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు | Director Gunasekhar Reacts Euphoria Movie Result And OTT Update | Sakshi
Sakshi News home page

Director Gunasekhar: దేవుడిని చూపించి హిట్స్ కొడుతున్నారు.. కానీ నాలాంటోళ్లని ఎంకరేజ్ చేయండి

Apr 1 2026 6:11 PM | Updated on Apr 1 2026 9:01 PM

Director Gunasekhar Reacts Euphoria Movie Result And OTT Update

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సినిమాలతో అప్పట్లో హిట్స్ కొట్టి, స్టార్ దర్శకుడిగా గుర్తింపు అందుకున్న గుణశేఖర్.. గత కొన్నేళ్ల నుంచి బాగా వెనకబడిపోయారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి పీరియాడిక్ మూవీస్ తీసి చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర వీటికి భారీ నష్టాలొచ్చాయి. దీంతో చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పటితరం యువత కనెక్ట్ అయ్యేలా 'యుఫోరియా' సినిమా తీశారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వస్తున్న సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ తన సినిమా గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి దర్శకుల్ని ప్రోత్సహించాలని వేడుకున్నారు.

(ఇదీ చదవండి: ధురంధర్‌ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు)

'ఫిబ్రవరి నెల ఆరంభంలో అందరికీ జీతాలు వస్తాయి. మంచి తేదీ అని 'యుఫోరియా' రిలీజ్ చేశాను కానీ జనాలు చూడలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు చూశామని చెప్పి యుఫోరియా లాంటి చిన్న చిత్రాల్ని పట్టించుకోలేదు. ఈ టైటిల్ వల్ల కూడా థియేటర్లలో మూవీ సరిగా ఆడలేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేటర్ ఆడియెన్స్ కోసం, కానీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందని మమ్మల్నే ​‍అడిగారు. రిలీజ్ టైంలో తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు'

'భూమిక.. లండన్‌లో ఉన్నప్పుడు స్టోరీ చెప్పాను. ఈ పాత్ర నమ్మితే మీకు అవార్డ్ వస్తుందని అప్పుడే చెప్పాను. నేను చెప్పినట్లే ఆమెకు ఉత్తమ సహాయ నటిగా గద్దర్ అవార్డ్ వచ్చింది. నాకు ఉత్తమ కథా రచయితగా పురస్కారం దక్కింది. థియేటర్లలోకి వచ్చిన సినిమాలని మూడు నెలల వరకు ఓటీటీల్లో రిలీజ్ చేయకూడదు. అలా అయితేనే థియేటర్ బతుకుంది. ఇండస్ట్రీకి ఇదే నా విన్నపం. ఈ మధ్య క్లైమాక్స్‌లో దేవుడి విశ్వరూపాలు చూపించి హిట్స్ కొడుతున్నారు. కథని నమ్మి సినిమాలు తీసే నాలాంటి దర్శకుల్ని ప్రోత్సహించండి' అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)

మీడియాతో చర్చించిన గుణశేఖర్.. 'మహేశ్ బాబుని యుఫోరియా చూడమని నేను అడగలేదు. కానీ తనంతట తానుగానే చూశాడు. అలానే ట్వీట్ చేశాడు. నేను సక్సెస్ మీట్ పెట్టి పిలిస్తే వచ్చేవాడు కూడా. యుఫోరియా.. ధురంధర్ రేంజ్ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే తీశాను. ఎందుకంటే ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదు ఇంటర్నేషనల్ సబ్జెక్ట్'  అని అన్నారు.

సారా అర్జున్, భూమిక, గౌతమ్ మేనన్ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా.. ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. కానీ జనాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. గుణశేఖర్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవడం కావొచ్చు, లేదంటే స్టార్స్ ఎవరూ లేకపోవడం కూడా ఈ మూవీ సరిగా ఆడకపోవడానికి కారణాలు కావొచ్చనిపిస్తోంది.

(ఇదీ చదవండి: థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్')

Advertisement
 
Advertisement
Advertisement