తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా ఎన్డీయే, ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. మేనిఫెస్టోలు విడుదల చేసి ఓటర్లను తమవైపునకు తిప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కేరళలో నిర్వహించిన ఒక సర్వే ఆసక్తికర వివరాలను వెల్లడించింది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే విషయంలో భారీ ట్విస్ట్ ఇచ్చింది.
కేరళలో Citizens Opinion Research and Evaluation (CORE) సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే మార్చి 23 నుండి 30 మధ్య రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాల నుండి 31,706 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. తద్వారా వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో అధికార కూటమి అయిన LDFకు మిశ్రమ స్పందన లభించగా, UDF పనితీరుపై ప్రజలు కొంత మేరకు సానుకూలంగా స్పందించారు. ఇక NDA విషయానికి వస్తే తీవ్రమైన ప్రతికూల భావనను ఎదుర్కొంటోంది.
👉ప్రస్తుత ప్రభుత్వం ఎల్‌డీఎఫ్ విషయానికి వస్తే.. సుమారు 43.1% మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ పనితీరుకు సానుకూల రేటింగ్ ఇచ్చారు. అందులో 17.16% మంది 'చాలా బాగుంది' అని, 25.94% మంది 'బాగుంది' అని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వం గణనీయమైన సంఖ్యలో విమర్శకులను కూడా ఎదుర్కొంటోంది. సుమారు 25.74% మంది ప్రభుత్వ పనితీరును 'బాగోలేదు' లేదా 'అస్సలు బాగోలేదు' అని అభివర్ణించారు. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది. సగటున 31% పాజిటివ్‌గా స్పందించారు.
👉ఇక, యూడీఎఫ్ విషయానికి వస్తే.. 42.07% మంది ఓటర్లలో 28.72% మంది మాత్రమే దాని పనితీరును 'బాగుంది' లేదా 'చాలా బాగుంది' అని రేట్ చేశారు. 29.22% మంది బాగాలేదు లేదా అసలు బాగాలేదు అని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో లాభం ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున ఊపు లేదు.
👉మరోవైపు.. ఎన్డీయే కూటమి విషయానికి వస్తే.. కూటమి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రతిస్పందించిన వారిలో 60% కంటే ఎక్కువ మంది కూటమి పనితీరును బాగాలేదు లేదా అస్సలు బాగాలేదు అని రేటింగ్ ఇచ్చారు. కేవలం 11.66% మంది ఓటర్లు మాత్రమే దానికి సానుకూల రేటింగ్ ఇచ్చారు. ఎన్డీయే సానుకూల రేటింగ్ దక్షిణ కేరళలో కొంత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వేను విశ్లేషిస్తే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య పోటాపోటీ ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రాంతాల వారీగా..
ఉత్తర కేరళ: LDF బలంగా ఉంది.
మధ్య కేరళ: UDF పోటీలో ఉంది.
దక్షిణ కేరళ: విభిన్న అభిప్రాయాలు, స్పష్టమైన ఆధిక్యం లేదు.
నియోజకవర్గాల వారీగా అంచనాలు (35 కీలక సీట్లు)
ఉత్తర కేరళ (కాసరగోడ్, కన్నూర్, వయనాడ): LDF బలంగా ఉండగా, UDF కొంత పోటీ, NDA బలహీనంగా
మధ్య కేరళ (ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్): LDF/UDF సమాన పోటీ, UDF కొంత ఆధిక్యం, NDA ప్రభావం తక్కువ
దక్షిణ కేరళ (తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట): LDF/UDF విభిన్న ఆధిక్యం, UDF కొన్ని సీట్లలో బలంగా, NDA ప్రతికూల అభిప్రాయం


