రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి | Tsutomu Yamaguchi was a remarkable survivor in two atomic blast | Sakshi
Sakshi News home page

రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి

Apr 2 2026 12:59 PM | Updated on Apr 2 2026 1:12 PM

Tsutomu Yamaguchi was a remarkable survivor in two atomic blast

ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్మొదలు పెట్టిన యుద్ధం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. మరోసారి అణుదాడి ముప్పు ఉండబోతోందా అన్న ఆందోళన  ప్రపంచాన్ని పటిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఆయన జీవితం నేర్పిన పాఠం గురించి తెలుసుకుందాం.

రెండు విధ్వంసాలనుంచి (1916–2010) మృత్యువును జయించిన ధీశాలి సుటోము యమగుచి (Tsutomu Yamaguchi). ఈయన కథ నిజంగా అద్భుతం. జపాన్‌కు చెందిన ఒక ఇంజనీర్, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా , నాగసాకి (1945) లో జరిగిన రెండు అణుబాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు. ఆగస్టు 6న హిరోషిమాలో బాంబు పేలుడుకు గురై గాయపడిన ఆయన, స్వస్థలమైన నాగసాకికి వెళ్లిపోవాలని ఆరాటపడ్డాడు. కానీ మళ్లీ మృత్యువు వెంటాడుతుందని ఊహించలేదు.   

సుటోము  యమగుచి  జీవితం ఒక రకంగా అత్యంత దురదృష్టకరమైనది. మరో విధంగా గొప్ప అదృష్టం. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో, అమెరికా జపాన్‌పై ఆగస్టు 6, 1945న  అణుబాండుదాడులు చేసింది. ఆగస్టు 6న మిత్సుబిషి కంపెనీ ఇంజనీర్‌గా యమగుచి తన విధినిర్వహణలో భాగంగా హిరోషిమాలో ఉన్నారు. సరిగ్గా ఆయన తిరిగి వెళ్ళే సమయానికి అమెరికా (హిరోషిమా)'లిటిల్ బాయ్' బాంబును ప్రయోగించింది.  పేలుడు కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చర్మం కాలిపోయింది, వినికిడి శక్తి దెబ్బతింది. వణుకుతూ, ఒక వైమానిక దాడి ఆశ్రయంలో ఆ భయంకర మైన రాత్రి గడిపాడు. అయినా ప్రాణాలతో బయటపడి, మరుసటి రోజే తన స్వస్థలమైన నాగసాకికి చేరుకున్నారు.ఆగస్టు 9న నాగసాకిలో తన కార్యాలయంలో కూర్చుని, హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి తన పైఅధికారికి వివరిస్తున్నారు.అతని బాస్ అతణ్ని నమ్మలేదు. అతిగా స్పందిస్తున్నాడని యమగుచిని నిందించాడు. ఒక్క బాంబు నగరాన్ని ఎలా నాశనం చేస్తుంది? అని ఆ అధికారి అడుగు తూండగానే, రెండో బాంబు 'ఫ్యాట్ మ్యాన్' నాగసాకిపై పడింది.రెండోసారి కూడా యమగుచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం విశేషం. 

ఈ రెండు అణుదాడుల్లో నుంచి ప్రాణాలతో బయటపడినట్లు అధికారికంగా గుర్తించబడిన ఏకైక వ్యక్తి ఆయనే. 2009లో జపాన్ ప్రభుత్వం ఆయనను అధికారికంగా 'ద్విగుణ బాంబు బాధితుడిగా' (Double Hibakusha) గుర్తించింది. యుద్ధం తర్వాత ఆయన, జ్వరాలు, వాంతులు, రేడియేషన్ ప్రభా, అనారోగ్యంతో చాలా కాలం బాధపడ్డారు. కుడి చేయి శాశ్వతంగా దెబ్బతింది. అతను ఒక చెవిలో వినికిడి శక్తిని కోల్పోయాడు. కానీ ఆయన మనోధైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.  కానీ బతికినంత కాలంలో రేడియేషన్ ప్రభావంతో బాధపడినప్పటికీ, ఆయన 93 ఏళ్లు  జీవించారు. 2010లో, 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

జీవితంలో ఎక్కువ కాలం ఈ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడటానికి ఇష్టపడని ఆయన, తన చివరి దశలో ప్రపంచానికి అణు ఆయుధాల ప్రమాదాన్ని వివరించాలని నిర్ణయించుకున్నారు. అణు ఆయుధాల ప్రభావానికి సజీవ సాక్ష్యం తాను అంటూ ప్రపంచ మానవాళిని హెచ్చరించారు. "నా కథను ప్రపంచానికి చెప్పడానికే నేను బతికున్నాను" అని ఆయన తరచూ అనేవారు. 

కాగా రెండు  అత్యంత విధ్వంసకరమైన బాధల్ని అనుభవించి, దాన్నుంచి అంతే  సాహసంగా బయటపడి, భవిష్యత్తుకోసం బలాన్ని కూడగట్టుకున్న ఒక సాధారణ ఇంజనీర్ కథ. యుద్ధం తెచ్చే విధ్వంసం అందులోనూ అణ్వాయుధాల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో యమగుచి జీవితం కళ్లముందుంచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement