డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ! | Data Shows Women Voters Emerging as key Decision Makers | Sakshi
Sakshi News home page

డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!

Apr 2 2026 1:01 PM | Updated on Apr 2 2026 1:14 PM

Data Shows Women Voters Emerging as key Decision Makers

ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.

సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్
గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.

రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..

అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.

పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.

కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.

తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్‌ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement