బీజేపీ గేమ్‌ ప్లాన్‌లో భాగమే: మమత ఫైర్‌ | CM Mamata Banerjee Says Malda hostage incident Is BJP Plan | Sakshi
Sakshi News home page

బీజేపీ గేమ్‌ ప్లాన్‌లో భాగమే: మమత ఫైర్‌

Apr 2 2026 1:14 PM | Updated on Apr 2 2026 2:58 PM

CM Mamata Banerjee Says Malda hostage incident Is BJP Plan

బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎస్‌ఐఆర్‌  విధుల్లో భాగంగా బెంగాల్​లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ అంశం కాస్తా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఈ వ్యవహారంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ప్లాన్‌ అంటూ విమర్శలు చేశారు.

తాజాగా మమత మాట్లాడుతూ..‘ఈ ఘటనతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ప్రజాగ్రహమే దీనికి కారణం. న్యాయాధికారులను ముట్టడించిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. కానీ SIRపై ప్రజలు కోపంగా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. దీనిపై నాకు ఎలాంటి అధికారం లేదు. శాంతిభద్రతలు వంటి అన్ని అధికారాలను వారే నా నుండి లాగేసుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

అలాగే, మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమే. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాషాయ పార్టీ, ఈ నెల చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. వారు శాంతిభద్రతలను నియంత్రించాలని కోరుకుంటున్నారు కానీ విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో పేర్ల తొలగింపుపై విస్తృతమైన అశాంతి నెలకొన్న నేపథ్యంలో శాంతిని కాపాడుకోవాలని ప్రలోభాలకు లొంగవద్దని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అంటూ కామెంట్స్‌ చేశారు.

 ఏం జరిగింది?
బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ వీధుల్లో భాగంగా బెంగాల్‌​లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. బెంగాల్‌లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.

ముగ్గురు మహిళలు సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, ఈ అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు. ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement