120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశ | A flower believed vanished 120 years ago rediscovered in Arunachal | Sakshi
Sakshi News home page

120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశ

May 19 2026 11:00 AM | Updated on May 19 2026 11:00 AM

A flower believed vanished 120 years ago rediscovered in Arunachal

దశాబ్దాల తర్వాత అరుణాచల్‌లో కనిపించిన అరుదైన మొక్క 

ఆల్పైన్‌ ప్రాంతంలో మళ్లీ ప్రత్యక్షమైన రోజాపుష్పాల ఉపజాతి  

ఈటానగర్‌: కాలుష్యమయ భారతంలో ఎన్నో వృక్షజాతులు అంతరించిపోయాయి. గత 120 ఏళ్లుగా కన్పించకుండా పోయిన ఒక పుష్పజాతి సైతం శాశ్వతంగా అంతర్థానమైపోయిందని అంతా భావిస్తున్న వేళ తాజాగా దాని జాడలు అరుణాచల్‌ప్రదేశ్‌లో కన్పించాయి. దీంతో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (Botanical Survey of India)పరిశోధకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల్లో సిక్కింలో 1905లో చివరిసారిగా ‘జీయుం మాక్రోసెపాలం’అనే రోజాపూల రకానికి చెందిన పుష్పజాతి మొక్కను చూశారు. ఆ తర్వాత పరిశోధకులకు అది ఎక్కడా కనిపించలేదు. 

ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సేలా పాస్‌ వద్ద దీని జాడను కనుగొన్నారు. సేలా పాస్‌ అనేది చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. పశ్చిమ అరుణాచల్‌లో ఆల్పైన్‌రీజియన్‌గా పిలిచే తవాంగ్, పశి్చమ కెమాంగ్‌ జిల్లాల్లో సుభాజిత్‌ లాహిరి, మోనాలిసా దాస్, సుధాంశు శేఖర్‌ దాస్‌లతో కూడిన బొటానికల్‌ పరిశోధకుల బృందం బొటానికల్‌ సర్వే చేపట్టగా సముద్రమట్టానికి ఏకంగా 13,780 అడుగుల ఎత్తులో ఈ మొక్కను కనుగొన్నారు. దీంతో తూర్పు హిమాలయపర్వతశ్రేణుల్లో అంతర్థాన మైందని భావిస్తున్న ఈ మొక్క ఇంకా ఉనికిలో ఉందని ప్రపంచానికి తెల్సిందని పరిశోధకులు వెల్లడించారు. వీళ్ల పరిశోధనా సంబంధిత వివరాలు ఫైటోటాక్సా అనే అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

ఇదీ చదవండి: వింటేజ్ లుక్‌ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్‌

వీళ్ల పరిశోధన తూర్పు హిమాలయాల్లోని జీవావరణవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి ఎత్తిచూపిందని జర్నల్‌ పొగిడింది. జీయుం మాక్రోసెపాలం జాతి పూలు చిన్నపాటి రోజాపుష్పాల్లా ఉంటాయి. ఈ మొక్కలకు పసుపురంగు పూలు పూస్తాయి. చిన్న కాండం మీద పుష్పం వికసిస్తుంది. ఒక్కోసారి ఒక్కచోటే ఎక్కువ పుష్పాలు పుష్పగుచ్ఛంగా ఏర్పడతాయి. హిమాలయాల్లోని అత్యల్ప ఉష్ణోగ్రత, మంచు మయ అతిశీతల కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని సైతం ఈ పుష్పజాతి జీవిస్తుంది. 

ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్‌ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?

ఇప్పటికే ఈ మొక్కను అంతర్జాతీయ ప్రకృతి పర్యవేక్షణ కూటమి (ఐయూసీఎన్‌) భారత్‌లో అంతరించిపోయే ఆస్కార మున్న జాతుల జాబితాలో చేర్చింది. జీవవైవిధ్యానికి నెలవైన తూర్పు హిమాలయాల్లోనూ అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల వంటివి ఇలాంటి చిన్న మొక్కల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేశాయి.  

ఇదీ చదవండి: ట్రంప్‌, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్‌

Advertisement
 
Advertisement
Advertisement