రేపటి నుంచి బేతాళస్వామి జాతర | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి బేతాళస్వామి జాతర

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

● రాష్ట్రంలో మొట్టమొదటి ఆలయం ఇదే ● జిల్లాలో ఏడుపాయల తర్వాత ఈ జాతరకు ప్రాముఖ్యత

● రాష్ట్రంలో మొట్టమొదటి ఆలయం ఇదే ● జిల్లాలో ఏడుపాయల తర్వాత ఈ జాతరకు ప్రాముఖ్యత

అల్లాదుర్గం (మెదక్‌): భూతాలకు అధిపతి బేతాళుడని కథల ద్వారా తెలుసు. కానీ బేతాళస్వామి ఆలయాలు ఉండటం చాలా అరుదు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలి ప్రజలు మృత్యువాత పడటంతో ప్రజలు బేతాళుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు పూజలు చేయడంతో వ్యాధులు దూరం కావడం, కోరిన కోరికలు తీర్చడంతో ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి బేతాళుడి జాతర ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మెదక్‌ జిల్లాలో ఏడుపాయల జాతర తర్వాత అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా చేస్తారు. ఈ జాతరకు కర్నాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు.

మొట్టమొదటి ఆలయం..

రాష్ట్రంలో మొట్టమొదటి బేతాళస్వామి ఆలయం అల్లాదుర్గంలోనే ఉంది. ఈ ఆలయం 400 ఏళ్ల క్రితమే ఉన్నట్లు స్థానికులు చెబుతారు. ఈ ఆలయానికి అసలు తలుపులే లేవు. క్షుద్రపూజలు చేసే కొందరు ఆలయాన్ని అపవిత్రం చేయడంతో ఆలయం చుట్టూ ఇనుపచువ్వలతో కంచె ఏర్పాటు చేశారు. బేతాళుడికి మొక్కుకున్న భక్తులు బోనాలు, గండజ్యోతితో ప్రదీక్షణలు చేస్తారు. ప్రజలు ఎడ్ల బండ్లను అలంకరించి బాజాభజంత్రీలతో ఆలయం చుట్టూ తిప్పుతారు. బేతాళ స్వామిపై భక్తితో ప్రజలు తమ పిల్లలకు బేతయ్య, బేతమ్మ పేర్లను ఎక్కువగా పెడతారు.

జాతర ఉత్సవాలు

బేతాళస్వామి జాతర ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు వేలాది భక్తులు హాజరవుతారు. ఉత్సవ కార్యక్రమాలు ఈనెల 3న పోలేరమ్మకు, 4న పోచమ్మకు, 5న దుర్గమ్మకు, 6న బేతాళస్వామికి బోనాలు తీస్తారు. 7న బేతాళస్వామి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు తిరుగుతాయి. 8న భాగవతం, 9న భజనలు, 10న వినోద కార్యక్రమాలు, 11న ఉదయం బేతాళస్వామికి పాచి బండ్లు తిరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ఉండటానికి రేకుల షెడ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement