భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి | Hanuman Jayanti celebrated in different Indian states | Sakshi
Sakshi News home page

భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి

Apr 2 2026 9:20 AM | Updated on Apr 2 2026 9:20 AM

Hanuman Jayanti celebrated in different Indian states

న్యూఢిల్లీ: అమోఘమైన బలం, అచంచల భక్తి, అకుంఠిత ధైర్యం,  అలవికాని స్వామి భక్తికి నిలువుటద్దం.. హనుమంతుడు. నేడు (గురువారం) హనుమజ్జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మన దేశ సంస్కృతిలో ఉన్న వైవిధ్యం హనుమాన్ జయంతి వేడుకల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదిలో ఒకలా, దక్షిణాదిలో మరోలా.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిలో  హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఉత్తర భారతం: ఉపవాసాలు, సుందరకాండ పఠనం 
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, బిహార్ తదితర రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి, ఆలయాలకు వెళతారు. రోజంతా కఠిన ఉపవాసం ఉండి, సాయంత్రం హనుమంతుడికి పూజలు నిర్వహించిన తర్వాతే ఆహారం తీసుకుంటారు. ఆలయాల్లో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. భక్తులకు బూందీ, లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేయడం  ఉత్తరాది ప్రత్యేకత.

మహారాష్ట్ర: వీధుల్లో శోభా యాత్రల సందడి
మహారాష్ట్రలో హనుమాన్ జయంతి అంటే భారీ ఉత్సవం. ఇక్కడ జరిగే ‘శోభా యాత్రలు’ అత్యంత ప్రధానమైనవి. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించిన రథాలపై హనుమంతుని విగ్రహాలను ఉంచి ఊరేగిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని భజనలు, కీర్తనలతో వీధులను హోరెత్తిస్తారు. అనేక చోట్ల ‘భండారా’ పేరుతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక: సింధూరార్చన, తమలపాకు పూజలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు చైత్ర పూర్ణిమ రోజున  నిర్వహిస్తారు. స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం, సింధూరాన్ని సమర్పించడం ఈ ప్రాంతాల్లో ప్రధాన ఆచారం. ఇక కర్ణాటకలో ఈ పండుగను మార్గశిర మాసంలో (డిసెంబర్ - జనవరి) జరుపుకోవడం విశేషం. భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

తమిళనాడు, కేరళ: వడమాల, వెన్న పూతతో అభిషేకాలు
దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు  ఉత్సాహంగా సాగుతాయి. భక్తులు స్వామివారికి ‘వడమాల’ సమర్పించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. అలాగే స్వామి విగ్రహానికి వెన్న పూయడం , తులసి దళాలతో పూజించడం, అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి.

గుజరాత్, రాజస్థాన్: దానధర్మాలు, సత్సంగాలు
పశ్చిమ భారత దేశంలోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భక్తులు హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించడం ఆచారంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక సత్సంగాలు అధికంగా జరుగుతాయి. కేవలం పూజలకే పరిమితం కాకుండా, పేదలకు అన్నదానం చేయడం, దుస్తులు పంపిణీ చేయడం వంటి దానధర్మాలకు ఈ రోజున అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రాంతాలు వేరైనా, సంప్రదాయాలు వేరైనా.. హనుమంతుడిపై ఉన్న భక్తి భారతీయులందరినీ ఒక్కటి చేస్తోంది. ‘అష్టసిద్ధి నవనిధి దాత’ అయిన ఆ ఆంజనేయుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం.

ఇది కూడా చదవండి: సురేష్‌ గోపి నిజంగా గెలవలేదా?

Advertisement
 
Advertisement
Advertisement