సురేష్‌ గోపి నిజంగా గెలవలేదా? | Kerala HC dismisses Suresh Gopis plea says he must face trial in petition | Sakshi
Sakshi News home page

సురేష్‌ గోపి నిజంగా గెలవలేదా?

Apr 2 2026 7:48 AM | Updated on Apr 2 2026 7:57 AM

Kerala HC dismisses Suresh Gopis plea says he must face trial in petition

కేరళ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసి, చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్, కేంద్ర మంత్రి సురేష్ గోపీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన ఎన్నికల విజయంపై విచారణ జరిపి తీరాల్సిందేనని కేరళ హైకోర్టు తేల్చిచెప్పింది. తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ సురేష్‌ గోపి పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది దీంతో సురేష్‌ గోపికి కేంద్ర మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ పరిణామం కేరళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఏమిటా ఆరోపణలు? ఎందుకీ వివాదం?
2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుంచి సురేష్ గోపీ గెలుపొందారు. అయితే ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మతపరమైన చిహ్నాలను, దైవచింతనను అడ్డం పెట్టుకున్నారని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్‌) నేత బినోయ్ ఏఎస్ కోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో మతాన్ని ఉపయోగించడం తీవ్రమైన నేరం. ఈ ఆరోపణలే ఇప్పుడు సురేష్ గోపీ మెడకు చుట్టుకున్నాయి.

హైకోర్టు ఏమంది? మంత్రికి చుక్కెదురు!
బినోయ్ దాఖలు చేసిన పిటిషన్‌లో పస లేదని, దానిని విచారించకుండానే కొట్టివేయాలని సురేష్ గోపీ హైకోర్టులో వాదించారు. కానీ జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ ధర్మాసనం ఈ వాదనను అంగీకరించలేదు. పిటిషనర్ లేవనెత్తిన అంశాల్లో  వాస్తవాలు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ ద్వారానే దీనికి ముగింపు పలకాలని స్పష్టం చేస్తూ, కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సురేష్ గోపీ ఇప్పుడు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీజేపీకి గుండెల్లో రైళ్లు
కేరళలో గత 70 ఏళ్లుగా ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీకి.. సురేష్ గోపీ 74,686 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని అందించారు. ఆ విజయంతోనే ఆయన మోదీ క్యాబినెట్‌లో పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ కోర్టు విచారణలో ఆయన దోషిగా తేలితే, ఆ విజయం రద్దు కావడమే కాకుండా, రాబోయే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే ప్రమాదం కూడా ఉంది.

రాజకీయంగా ఇబ్బందికర పరిణామం
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి విచారణ జరగడం రాజకీయంగా బీజేపీకి, సురేష్ గోపీకి పెద్ద తలనెప్పిగా మారింది. కోర్టు తదుపరి విచారణలో ఎలాంటి సాక్ష్యాధారాలు బయటకు వస్తాయోనని కేరళలోని వామపక్ష, కాంగ్రెస్ కూటములు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కేరళలో బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ప్రత్యర్థులకు ఈ తీర్పు ఒక ఆయుధంగా మారింది.

సురేష్ గోపీ తదుపరి అడుగు ఎటు?
హైకోర్టు నిర్ణయంతో సురేష్ గోపీ ముందు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హైకోర్టులో విచారణను ఎదుర్కోవడం, రెండు ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం. అయితే హైకోర్టు ఘాటుగా స్పందించిన తీరు చూస్తుంటే ఆయనకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. సినీ గ్లామర్‌తో రాజకీయాలను శాసించిన ఈ ‘మాస్ హీరో’కి, ఈ లీగల్ బ్యాటిల్ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

ఇది కూడా చదవండి: ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement