ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం | Magnitude 7.4 quake hits off Indonesia’s Ternate | Sakshi
Sakshi News home page

ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం

Apr 2 2026 7:11 AM | Updated on Apr 2 2026 8:59 AM

Magnitude 7.4 quake hits off Indonesia’s Ternate

జకార్తా: ఇండోనేషియాలో మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తూర్పు ఇండోనేషియాలోని టెర్నేట్ నగరం సమీపంలో ఉత్తర మొలుక్కా సముద్రంలో గురువారం సంభవించిన భారీ భూకంపం పెను ప్రకంపనలు సృష్టించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌సీఎస్‌) వెల్లడించింది.

 


సముద్ర మట్టానికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ద్వీపాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాలకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా సునామీ హెచ్చరికల విభాగం హెచ్చరించింది. సముద్ర అలలు సాధారణ స్థాయి కంటే 0.3 మీటర్ల నుంచి  ఒక మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

 

టెర్నేట్, టిడోర్ తదితర నగరాల్లో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని (ఎవాక్యూషన్) సూచించింది. భూకంప ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నట్లు స్థానిక 'మెట్రో టీవీ' దృశ్యాలను ప్రసారం చేసింది. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు. జపాన్, గ్వామ్, పాపువా న్యూగినియా, తైవాన్ తీరాల్లోనూ స్వల్ప స్థాయిలోఅలలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement