ఖాట్మండు: ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించాలని ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు తీవ్రమైన వంచనకు గురవుతున్నారు. కొందరు గైడ్లు, హెలికాప్టర్ సంస్థలు కలిసి, పర్యాటకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పర్యాటకులకు తెలియకుండా వారి ఆహారంలో విషం కలిపి, ఆపై అత్యవసర రెస్క్యూ పేరుతో సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 167 కోట్లు) ఇన్సూరెన్స్ స్కామ్‌కు పాల్పడిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే...
నేపాల్‌లో ట్రెకింగ్ చేసే పర్యాటకుల భోజనంలో గైడ్లు ఉద్దేశపూర్వకంగా ‘బేకింగ్ సోడా’ కలుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్ల పర్యాటకులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు అవుతాయి. ఇది చూసి పర్యాటకులు తమకు ‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’ (ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే అనారోగ్యం) వచ్చిందని భ్రమపడతారు. వెంటనే గైడ్లు వారిని భయపెట్టి, అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించాలని ఒత్తిడి చేస్తారు.
వందల కోట్ల దోపిడీ ఇలా..
ఈ కుట్రలో ట్రెకింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రులు ఒక మాఫియాగా ఏర్పడ్డాయి. పర్యాటకులకు చికిత్స చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కేటుగాళ్లు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి నేపాల్ పోలీసులు ఇప్పటివరకు 32 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్ కంపెనీ యజమానులు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 11.3 మిలియన్ డాలర్ల జరిమానా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. నేపాల్ టూరిజం రంగంలో ఇలాంటి స్కామ్‌లు పెరిగిపోతుండటంతో, ఇప్పటికే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు నేపాల్ ట్రెక్కర్లకు కవరేజీ ఇవ్వడం నిలిపివేశాయి.
ఇది కూడా చదవండి: భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి


