ముంబై: భారతీయ చిత్రకళా చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదయ్యింది. లెజెండరీ చిత్రకారుడు రాజా రవివర్మ సృష్టించిన అద్భుత కళాఖండం ‘యశోద కృష్ణ’ వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడయి, భారతీయ కళా రంగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ముంబై వేదికగా జరిగిన వేలంలో ఈ పెయింటింగ్ ఏకంగా రూ. 167.2 కోట్లు (సుమారు 18 మిలియన్ డాలర్లు) పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
హోరాహోరీ బిడ్డింగ్.. విజేతగా పూనావాలా
బుధవారం సాయంత్రం సాఫ్రన్‌ఆర్ట్ (Saffronart) నిర్వహించిన ‘స్ప్రింగ్ లైవ్ ఆక్షన్’లో ఈ పెయింటింగ్ కోసం బిడ్డర్లు పోటీ పడ్డారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ బిడ్డింగ్‌లో ప్రముఖ బిలియనీర్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా ఈ కళాఖండాన్ని సొంతం చేసుకున్నారు. భారతీయ చిత్రకళా విపణిలో ఇప్పటివరకు ఒక పెయింటింగ్‌కు లభించిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం.
అద్భుత కళాఖండం ‘యశోద-కృష్ణ’
భారతీయ చిత్రకళలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజా రవివర్మ గీసిన ఈ తైలవర్ణ చిత్రం (Oil Painting) అత్యంత అరుదైనదిగా భావిస్తారు. యశోదమ్మ తన చిన్ని కృష్ణుడిపై కురిపించే మమకారాన్ని అత్యంత సహజంగా, జీవకళ ఉట్టిపడేలా రవివర్మ ఇందులో చిత్రీకరించారు. రంగుల వినియోగం, పాత్రల హావభావాల విషయంలో రవివర్మ చూపిన ప్రతిభ ఈ పెయింటింగ్‌కు అత్యంత గుర్తింపు తెచ్చిపెట్టింది. గతంలో కూడా రవివర్మ చిత్రాలు భారీ ధరలకే అమ్ముడైనప్పటికీ, తాజా వేలం వాటినన్నింటినీ అధిగమించింది. భారతీయ కళా వైభవానికి, సాంప్రదాయ చిత్రకళకు ప్రపంచ స్థాయిలో ఎంతటి గౌరవం ఉందో ఈ రికార్డు ధర మరోసారి నిరూపించింది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి


