‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్! | Researchers Hring AI Precision to Crime Interrogations | Sakshi
Sakshi News home page

‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్!

Apr 2 2026 1:42 PM | Updated on Apr 2 2026 2:34 PM

Researchers Hring AI Precision to Crime Interrogations

కాసరగోడ్: నేరస్తుల నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ఇకపై ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించాల్సిన అవసరం లేదు. నిందితుడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధమా అనేది క్షణాల్లో తేల్చేసే ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరికరాన్ని కేరళ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సస్పెక్ట్ ఎమోషనల్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎస్‌ఈఎంఎస్‌) పేరుతో రూపొందించిన ఈ సాంకేతికత, నేర విచారణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యవస్థలో నిందితుడి మణికట్టుకు ఒక బయోమెట్రిక్ బ్యాండ్‌ను అమరుస్తారు. విచారణ జరిపే అధికారి కెమెరా కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ధరిస్తారు. ఈ సమయంలో నిందితుడి ముఖ కవళికలు, గొంతులో వచ్చే మార్పులు, హృదయ స్పందన రేటు, చర్మ ప్రతిచర్యలను బయోమెట్రిక్ బ్యాండ్ నిశితంగా పరిశీలిస్తుంది. బ్లూటూత్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ, నిందితుడు అబద్ధం చెప్పే సమయంలో కలిగే అతిసూక్ష్మమైన శారీరక, మానసిక మార్పులను రియల్ టైమ్‌లో విశ్లేషించి, విచారణాధికారికి తెలియజేస్తుంది.

ప్రత్యేకతలు ఇవే..
మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే ఈ ఎస్‌ఈఎంఎస్‌, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌) సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. దీనివల్ల విచారణ అధికారికి నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన హెచ్చరికలు నేరుగా లైవ్ వీడియో ఫీడ్‌లోనే కనిపిస్తాయి. సాధారణంగా లై డిటెక్టర్ లేదా నార్కో అనాలిసిస్ వంటి పరీక్షలకు కోర్టు లేదా నిందితుడి అనుమతి తప్పనిసరి. కానీ, ఎస్‌ఈఎంఎస్‌ విషయంలో చట్టపరమైన అనుమతులు లభిస్తే, అటువంటి నిబంధనల అవసరం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

రూపకర్తలు వీరే..
జైన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మెబిన్ విల్సన్ థామస్, క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కె. రాజన్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ అంజనా పి. నాయర్ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. ఇప్పటికే దీనికి పేటెంట్ లభించడం విశేషం. ఈ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, కేవలం మాటలతోనే నిజాలను బయటకు తీయవచ్చని, తద్వారా హింసాత్మక విచారణలకు స్వస్తి పలకవచ్చని పరిశోధకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ‘బెంగాల్‌ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement