Crime Branch of the police
-
‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్!
కాసరగోడ్: నేరస్తుల నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ఇకపై ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించాల్సిన అవసరం లేదు. నిందితుడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధమా అనేది క్షణాల్లో తేల్చేసే ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరికరాన్ని కేరళ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సస్పెక్ట్ ఎమోషనల్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎస్‌ఈఎంఎస్) పేరుతో రూపొందించిన ఈ సాంకేతికత, నేర విచారణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.ఇది ఎలా పనిచేస్తుంది?ఈ వ్యవస్థలో నిందితుడి మణికట్టుకు ఒక బయోమెట్రిక్ బ్యాండ్‌ను అమరుస్తారు. విచారణ జరిపే అధికారి కెమెరా కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ధరిస్తారు. ఈ సమయంలో నిందితుడి ముఖ కవళికలు, గొంతులో వచ్చే మార్పులు, హృదయ స్పందన రేటు, చర్మ ప్రతిచర్యలను బయోమెట్రిక్ బ్యాండ్ నిశితంగా పరిశీలిస్తుంది. బ్లూటూత్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ, నిందితుడు అబద్ధం చెప్పే సమయంలో కలిగే అతిసూక్ష్మమైన శారీరక, మానసిక మార్పులను రియల్ టైమ్‌లో విశ్లేషించి, విచారణాధికారికి తెలియజేస్తుంది.ప్రత్యేకతలు ఇవే..మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే ఈ ఎస్‌ఈఎంఎస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. దీనివల్ల విచారణ అధికారికి నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన హెచ్చరికలు నేరుగా లైవ్ వీడియో ఫీడ్‌లోనే కనిపిస్తాయి. సాధారణంగా లై డిటెక్టర్ లేదా నార్కో అనాలిసిస్ వంటి పరీక్షలకు కోర్టు లేదా నిందితుడి అనుమతి తప్పనిసరి. కానీ, ఎస్‌ఈఎంఎస్ విషయంలో చట్టపరమైన అనుమతులు లభిస్తే, అటువంటి నిబంధనల అవసరం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.రూపకర్తలు వీరే..జైన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మెబిన్ విల్సన్ థామస్, క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కె. రాజన్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ అంజనా పి. నాయర్ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. ఇప్పటికే దీనికి పేటెంట్ లభించడం విశేషం. ఈ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, కేవలం మాటలతోనే నిజాలను బయటకు తీయవచ్చని, తద్వారా హింసాత్మక విచారణలకు స్వస్తి పలకవచ్చని పరిశోధకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘బెంగాల్ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం -
చైన్ స్నాచర్లపై ప్రత్యేక దృష్టి
దక్షిణ ఢిల్లీ డీసీపీ జైస్వాల్ న్యూఢిల్లీ: నగరంలో రోజురోజుకీ మితిమీరిపోతున్న చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు క్రైం బ్రాంచి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరాలు చేసేందుకు నేరస్తులు అనుసరిస్తున్న మార్గంలోనే వారిని నియంత్రించాలని వ్యూహం పన్నారు. ఈ మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశారు. పోలీసుల వ్యూహం ఫలించింది. దక్షిణ ఢిల్లీలో సుమారు 50కి పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన గౌరవ్ చిక్నా(24) అనే స్నాచర్‌ను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. అతడి వద్ద ఒక తుపాకీ, రూ. 8 లక్షల విలువచేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (దక్షిణ) బి.ఎస్.జైస్వాల్ మాట్లాడుతూ దక్షిణ ఢిల్లీలో పలుచోట్ల చైన్ స్నాచింగ్ కేసుల నమోదు ఎక్కువయ్యాయన్నారు.నిందితులు ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారు తేరుకునేలోపే మెడల్లోని చైన్లను లాక్కుపోతున్నారన్నారు. చాలా కేసుల్లో దొంగలు ద్విచక్రవాహనాలపై రోడ్డుకు రాంగ్ సైడ్‌లో వచ్చి ఈ ఘటనలకు పాల్పడుతున్నారు. రాంగ్‌సైడ్‌లో వస్తే దొంగతనం చేసిన తర్వాత సులభంగా తప్పించుకు పారిపోవచ్చని వారి ఆలోచన అన్నారు. దీంతో, దొంగల వ్యూహాలను పరిశీలించిన తర్వాత తాము కూడా అదే మార్గంలో పయనించి, దొంగలను అరెస్టు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు 30 బృందాలను ఏర్పాటుచేశామని, వారికి అతివేగంగా వెళ్లే మోటార్‌సైకిళ్లను అందజేశామన్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు పోలీసులు ఉంటారని, వారికి ఆయుధాలు, వైర్లెస్ సెట్లు అందజేశామన్నారు. వీరు బిజీ రోడ్లలో సాధారణ పౌరులుగా తిరుగాడుతూ రోడ్డుపై వెళుతున్న మహిళలపై నిఘా పెడతారన్నారు. ఎట్టకేలకు తమ వ్యూహం ఫలించిందని డీసీపీ తెలిపారు. ఎన్‌హెచ్-8కు సమీపంలోని శంకర్ విహార్ ప్రాంతంలో మహిళ మెడలో చైన్ తెంపుకుపోయేందుకు ద్విచక్రవాహనంపై నుంచి దిగిన గౌరవ్ చిక్నాను తమ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. అతడివద్ద బుల్లెట్లతో నిండి ఉన్న పిస్టల్, బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసుల ఉనికిని గ్రహించిన రెండో దొంగ జావెద్ బైక్‌పై తప్పించుకు పారిపోయాడని తెలిపారు. నిందితుడిని పోలీసుల పద్ధతిలో విచారించగా జెరెరాకు చెందిన సుమారు 8 మంది సభ్యులున్న బడా గౌరవ్ గ్యాంగ్‌లో తాను కూడా సభ్యుడినని చిక్నా చెప్పాడన్నారు. పలు చైన్ స్నాచింగ్, దొంగతనాలు, హత్య కేసుల్లో నిందితుడైన బడా గౌరవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. దీంతో గ్యాంగ్ బాధ్యతలను తాను తీసుకున్నట్టు చిక్నా చెప్పాడని డీసీపీ వివరించారు. గ్యాంగ్ సభ్యులందరూ దక్షిణ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ ప్రాంతాల్లో పలు చోట్ల చైన్ దొంగతనాలకు పాల్పడుతుంటారని, కొట్టేసిన దాంట్లో కొంత భాగం తమ నాయకుడు బడా గౌరవ్‌కు అందజేస్తారని వివరించాడన్నారు. కాగా, ముఠాలోని మిగిలిన సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంటామని జైస్వాల్ చెప్పారు.


