గుండె ఆరోగ్యం కోసం... ఈ రంగులోని పండ్లు భేష్.. | Health Tips: Choose a Variety of Colorful Fruits to Improve Heart Health | Sakshi
Sakshi News home page

గుండె ఆరోగ్యం కోసం... ఈ రంగులోని పండ్లు భేష్..

Aug 18 2026 10:22 AM | Updated on Aug 18 2026 10:30 AM

Health Tips: Choose a Variety of Colorful Fruits to Improve Heart Health

ఎరుపు, నీలం, ఊదా రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో సహజంగా లభించే ‘ఆంథోసయానిన్’ అనే జీవక్రియాత్మక సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి, జీవక్రియల మెరుగుదలకు తోడ్పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా బ్లూబెర్రీలు వంటి పండ్లలో ఈ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో, అవి గుండె ఆరోగ్యానికి తొడ్పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. 

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ సమగ్ర విశ్లేషణలో 27 ప్రచురణల్లో వెల్లడైన 18 దీర్ఘకాలిక అధ్యయనాలు, అలాగే ఎలాంటి వ్యాధులు లేని పెద్దలపై నిర్వహించిన 65 ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌ను పరిశీలించారు. తక్కువ స్థాయిలో ఆంథోసయానిన్లు తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వారిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కనిపించినట్లు అధ్యయనం తెలిపింది. 

కలిగే ప్రయోజనాలు..
గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 26 శాతం తగ్గింది.
గుండెపోటు (మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్) ప్రమాదం 18 శాతం తగ్గింది.
టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం తగ్గింది.
గుండె సంబంధిత కారణాలతో మరణాల ప్రమాదం 9 శాతం తగ్గింది.
అధిక రక్తపోటు ప్రమాదం 8 శాతం తగ్గింది.

రోజుకు కనీసం 50 మిల్లీగ్రాముల ఆంథోసయానిన్లు తీసుకున్న వారిలో రక్తనాళాల పనితీరు మెరుగుపడటంతో పాటు, ఇన్సులిన్ స్థాయిల్లో సానుకూల మార్పులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ స్థాయిని సహజంగా రంగులున్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా పొందవచ్చని వారు పేర్కొన్నారు.

భారతదేశంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో వివిధ రంగుల పండ్లు, కూరగాయలను చేర్చడం వంటి సమతుల ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ సందర్బంగా అమెరికా హైబుష్ బ్లూబెర్రీ కౌన్సిల్ భారత ప్రతినిధి రాజ్ కపూర్ మాట్లాడుతూ, “సహజ రంగులతో కూడిన ఆహార పదార్థాలను రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. ఆంథోసయానిన్లు సమృద్ధిగా ఉండే అమెరికన్ బ్లూబెర్రీల వంటివి కూడా భారతీయ ఆహార అలవాట్లలో సులభంగా చేర్చుకోవచ్చు” అని తెలిపారు.

అయితే ఒక్క ఆహార పదార్థం మాత్రమే వ్యాధులను నివారిస్తుందని లేదా చికిత్స చేస్తుందని ఈ పరిశోధన చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సమతుల ఆహారం, క్రమమైన శారీరక వ్యాయామం, సరిపడ నిద్ర, వైద్యుల సూచనలు పాటించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆంథోసయానిన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. 

ఈ అధ్యయన ప్రధాన పరిశోధకురాలు ప్రొఫెసర్ ఏడిన్ క్యాసిడీ మాట్లాడుతూ, చిన్న చిన్న ఆహారపు మార్పులు కూడా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనం తేల్చిందన్నారు.

(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement