ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్‌లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.
ఆంథోసయనిన్‌లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్‌లను అందిస్తాయి.
కలిగే లాభాలు..
సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:
గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.
సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.
టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.
గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువ
అధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువ
రోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్‌లు, డెజర్ట్‌లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.
అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.


