93 ఏళ్ల వయసులో అథ్లెటిక్‌గా బామ్మ..! | started running at 93 and won gold around the world | Sakshi
Sakshi News home page

తొమ్మిది పదుల వయసులో అథ్లెటిక్‌గా బామ్మ..! ఆఖరికి వందేళ్ల తర్వాత కూడా..

Aug 16 2026 2:56 PM | Updated on Aug 16 2026 3:08 PM

started running at 93 and won gold around the world

చాలామంది వృద్ధాప్యం అంటే రెస్ట్‌ తీసుకునే వయసుగా భావిస్తారు. వాస్తవంగా ఆ వయసులో ఏదో దేవుడి నామ జపం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం తొమ్మిది పదుల వయసులో అథ్లెట్‌గా మారింది. పైగా ఎన్నో రికార్డులు పతకాలు గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు..సాధించాలనే కోరిక ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని నిరూపించింది. పైగా పట్టుదల, శక్తి వయసుతోపాటు సన్నగిల్వవు అని చాటిచెప్పి..యువతకు స్ఫూర్తిగా నిలిచింది ఈ సూపర్‌ బామ్మ.

ఆ బామ్మే చండీగఢ్‌కి చెందిన మన్‌కౌర్‌. ఆమె 1916లో పంజాబ్‌లో జన్మించారు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం క్రీడలకు దూరంగానే పెరిగారు. ఆమె కుమారుడు గుర్దేవ్‌సింగ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొనడం చూసి 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లోకి ప్రవేశించారు. కేవలం అతను పోటీపడటాన్ని చూసి ఈ బామ్ తాను కూడా పరుగును ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేసింది. 

అలా ఆమె 93వ ఏట అథ్లెటిక్‌ కెరీర్‌ని ప్రారంభించి ఎన్నో పతకాలు కైవసం చేసుకుంది. ఆమె విజయాలు భారతదేశం దాటి విస్తరించాయి. పోలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నారు. దాంతో ఆమెను అంతా చండీగఢ్‌ అద్భుతంగా పిలుచుకునేవారు. ఆ తర్వాత 2013లో అమెరికాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో 100మీ, 200మీ ఈవెంట్లలో బంగారు పతకాలను గెలుచుకున్నారు. అవేగాక జాతీయ, అంతర్జాతీయ మాస్టర్స్ పోటీలలో కూడా పతకాలను సాధించారు. 

2016లో, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో, ఆమె ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన శతాధిక వయస్కురాలిగా గుర్తింపు పొందారు. విచిత్రం ఏంటంటే.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆమె ప్రదర్శనలు కొనసాగాయి. 2017లో న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌లో, 100మీ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అలాగే అలాగే వరల్డ్ మాస్టర్స్, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో 20కి పైగా పతకాలు సాధించింది. వీటితోపాటు ఆ బామ్మకు మార్చి 08, 2020లో రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా నారీశక్తి పూరస్కారాన్ని అందుకుంది. 

ఇక్కడ కౌర్‌ కథ ఒక ప్రొఫెషనల్ కెరీర్‌ను నిర్మించుకోవాలనే ఆశతో యువ అథ్లెట్‌గా పరుగు ప్రారంభించలేదు. కొత్తగా ఏదైనా ప్రయత్నించడం ఇకపై సాధ్యం కాదని చాలా మంది నమ్మే వయస్సులో, అ‍థ్లెటిక్‌గా ట్రాక్‌పై అడుగుపెట్టి పోటీలలో పాల్గొని సరికొత్త రికార్డుని రాసి స్ఫూర్తిగా నిలిచించారామె. నిజానికి ఆ వయసులో ఆ ప్రయత్నం చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అది కౌర్‌ బామ్మ సొంతం. చెప్పాలంటే పట్టుదల, అపారమైన శక్తి, స్థైర్యానికి ప్రతీకగా నిలిచింది. కాగా, జూలై 31, 2021న 105 ఏళ్ల వయసులో మరణించారామె.

(చదవండి: వాటితో ఫేషియల్‌..'గ్లో' మాములుగా లేదు..! వీడియో వైరల్‌)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement