నదియా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రాత్రి వేళ నకాషిపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెతువాడహరి రైల్వే గేట్ సమీపంలో దుండగులు జరిపిన హింసాత్మక దాడిలో సీనియర్ కాంగ్రెస్ నేత అనిసుర్ రెహమాన్, ఆయన కుమారుడు అబు సుఫియాన్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు వారి కారును అడ్డగించి తొలుత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత వాహనాన్ని ఆపి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అధిక రక్తస్రావం కావడంతో తండ్రీకొడుకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నకాషిపారా పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్యల వెనుక స్థానిక ఆధిపత్య పోరు, కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. జైలులో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత జుబ్బార్ షేక్ ఆదేశాల మేరకే ఈ దారుణం జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజలకు రక్షణ కరువైందని సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ కిరాతక హత్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: ట్రాక్‌పై తోడేలు తల.. పట్టాలు తప్పిన స్పెషల్ ట్రైన్!


