సిల్లీ: జార్ఖండ్‌లోని సిల్లీ- బొకారో రైలు మార్గంలో శనివారం తెల్లవారుజామున మధుపూర్ శ్రావణ మేళా స్పెషల్ ట్రైన్ (నంబర్ 08895) ప్రమాదానికి గురైంది. పోల్ నంబర్ 354/ఎస్‌ఏ-4 సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్ నుంచి మూడో కోచ్ (నంబర్ ఎస్‌ఈసీ 64776) ఒక చక్రం పట్టాలు తప్పడంతో ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే ట్రాక్ పాయింట్ అండ్ క్రాసింగ్ వద్ద ఒక తోడేలు (భేడియా) తల ఇరుక్కోవడం వల్ల కోచ్ చక్రం పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కోచ్‌లో ప్రయాణిస్తున్న భక్తులందరినీ సురక్షితంగా కిందకు దించామని అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రాంచీ రైల్వే డివిజన్ మేనేజర్ కరుణా నిధి సింగ్‌తో పాటు రైల్వే అధికారులు, రైల్వే రక్షణ దళం, జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సహాయక సిబ్బంది తక్షణమే స్పందించి సుమారు గంట వ్యవధిలోనే కోచ్‌ను తిరిగి పట్టాలపైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ కోచ్‌ను మురి యార్డ్‌కు తరలించారు. ఘటనా స్థలంలో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ సమయంలో పలు రైళ్ల మార్గాలను మళ్లించారు. గంట సమయం పట్టిన ఈ చర్యల అనంతరం బొకారో రైల్వే మార్గంలో ఉదయం దాదాపు 5:15 గంటలకు రైళ్ల రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో రైలును గమ్యస్థానానికి పంపించారు. పాయింట్ అండ్ క్రాసింగ్ అనేది రైళ్లను ఒక మార్గం నుంచి మరో మార్గానికి సురక్షితంగా మార్చడానికి ఉపయోగపడే అత్యంత కీలకమైన రైల్వే వ్యవస్థ అని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: మయన్మార్‌లో మరో ప్రళయం.. వణికిస్తున్న చైనా మెగా డ్యామ్!


