ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్నది ఇరాన్ నిర్ణయమేనని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి వాస్తవాన్ని అంగీకరించండి.. ఊహల్లో విహరించడం ఆపండి. అప్పటివరకు ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది అంటూ హెచ్చరించారు. కేవలం ఆదేశాలు ఇవ్వడం, ట్వీట్ చేయడం లేదా యుద్ధనౌకలను మోహరించడం ద్వారా జలసంధిపై నియంత్రణ సాధించలేరని అమెరికాకు కౌంటరిచ్చారు.
మరోవైపు, ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో రాకపోకలు భారీగా పడిపోయాయి. శుక్రవారం కేవలం రెండు నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ Kpler విశ్లేషణ తెలిపింది. వాటిలో ముడి చమురు రవాణా కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి. జలసంధి మూసివేత కొనసాగితే చమురు, ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రజలు భరించాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే ఆ దేశంపై ఆర్థికంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఒకవైపు హార్ముజ్‌పై ఇరాన్ పట్టు.. మరోవైపు దాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటున్న ట్రంప్.. ఈ ప్రతిష్ఠంభన ఎటు దారితీస్తుందన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన.
చర్చలకు నో ఛాన్స్?
ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కూడా ముందుకు కదలడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి.. అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి అధికారిక శాంతి చర్చలు కాదని ఇరాన్ స్పష్టం చేసింది.


