ఇండోనేసియాలో భూకంపం  | Powerful earthquake kills dozens in eastern Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో భూకంపం 

Aug 16 2026 5:22 AM | Updated on Aug 16 2026 5:22 AM

Powerful earthquake kills dozens in eastern Indonesia

47 మంది మృతి 

తీవ్రత 7.7గా నమోదు 

ఫ్లోరెస్‌ ద్వీపంలో పెను విధ్వంసం 

కొనసాగుతున్న సహాయక చర్యలు 

మావుమెర్‌: ఇండోనేసియా సముద్రతీర ప్రాంతంలో శనివారం సంభవించిన భారీ భూకంపం 47మంది ప్రాణాలు బలితీసుకుంది. భూకంపం తాకిడికి పలు భవనాలు, ఇళ్లు కూలిపోగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ఘటనలో పలువురు గాయపడ్డారని, అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

సునామీ హెచ్చరికలు ముందు జారీ చేసినా సముద్ర మట్టంలో పెద్దగా తేడాలు లేకపోవడంతో ఇండోనేసియా వాతావరణ విభాగం, క్లైమటాలజీ అండ్‌ జియో ఫిజిక్స్‌ సంస్థ సూచనల మేరకు సునామీ ప్రమాదం లేదని తేల్చారు. అమెరికా జియలాజికల్‌ సర్వే లెక్కల ప్రకారం ఈ భూకంపం ఇండోనేసియాలోని ఫ్లోరెస్‌ ప్రాంతంలో, స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుఝాము 5.58 గంటలకు సముద్రగర్భంలో పది కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

ఈస్ట్‌ నూసా టెంగార ప్రావిన్స్‌లోని ఎండే నగరానికి వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. భూకంపం తరువాత మధ్యాహ్న సమయానికి 235 ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో 6.2 తీవ్రత గల ప్రకంపన ఒకటి ఉండటం గమనార్హం. సముద్ర జల మట్టాల పరిశీలన కేంద్రాలు మంగ్గారై, ఈస్ట్‌ మంగ్గారైల వద్ద 5.3 అడుగుల ఎత్తైన అలలను గుర్తించాయి.

 అలాగే మావురోల్, ఎండే ప్రాంతాల్లో సుమారు మూడు అడుగుల ఎత్తు అలలు ఎగసిపడినట్లు తెలిసింది. బులుకుంబా, సులవేసి దక్షిణ ప్రాంతం, సాపే, బీమా ప్రాంతాల్లోనూ ఒకటిన్నర అడుగుల వరకూ అలలు ఎగసినట్లు సమాచారం. సిక్కా, పశ్చిమ మంగ్గారై, తూర్పు మంగ్గారై ప్రాంతంలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని, సహాయక బృందాలు ఇక్కడి నుంచే దాదాపు 40 మృతదేహాలను వెలికితీశాయని జాతీయ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి ఫతూర్‌ రెహ్మాన్‌ తెలిపారు. 

మరో రెండు గ్రామాలను మట్టిదిబ్బలు కప్పేశాయని, మృతదేహాల కోసం ఇక్కడ కూడా గాలింపు కొనసాగుతోందని వివరించారు. మరోవైపు భూకంప బాధితులు ఎక్కువగా ఉండే అవకాశముందన్న అంచనాతో పలు ఆసుపత్రులు వీలైనంత మేరకు రోగులను ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు స్థానిక టెలివిజన్‌ ఛానళ్లలో కనిపించాయి. అంతేకాకుండా.. గాయపడ్డ వారి చికిత్స కోసం బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఐవీ స్టాండ్లను సిద్ధంగా ఉంచారు. బాధితులను వేగంగా ఆసుపత్రులకు చేర్చే ఉద్దేశంతో  ఇండోనేసియా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మూడు హెలికాప్టర్లు, ఒక సహాయక నౌకను రంగంలోకి దించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement