సీఎం విజయ్‌ స్పీచ్‌.. జెన్‌జీ, కులం, మతంపై కీలక వ్యాఖ్యలు.. | CM Vijay Independence Day speech calls for freedom, caste and religion | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌ స్పీచ్‌.. జెన్‌జీ, కులం, మతంపై కీలక వ్యాఖ్యలు..

Aug 15 2026 12:26 PM | Updated on Aug 15 2026 12:37 PM

CM Vijay Independence Day speech calls for freedom, caste and religion

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్‌ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయ సందేశంతో గట్టిగా గళం విప్పారు. కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సంకెళ్లను తెంచినప్పుడే నిజమైన స్వేచ్ఛ సాధించినట్లని, అవినీతి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడం కూడా మరో రకమైన స్వాతంత్ర్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. ‘ప్రజలు తమను బానిసలుగా ఉంచుతున్నారని గుర్తించినప్పుడే ఐక్యంగా మారతారని అన్నారు. అప్పుడు కులం, మతం వంటి సంకెళ్లు తెగిపోతాయని, మహాత్మా గాంధీ నాయకత్వంలోని స్వాతంత్ర్య పోరాటంలోనూ ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించిన విజయ్.. ఆ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. “తమిళనాడును అవినీతి నుంచి విముక్తి చేయడం కూడా ఒక రకమైన స్వాతంత్ర్యమే” అంటూ అధికారులను అవినీతి రహిత పాలన కోసం పనిచేయాలని కోరారు.

 

కేంద్ర ప్రభుత్వంతో పరిపాలనా అంశాల్లో కలిసి పనిచేస్తామని, అయితే తమిళనాడు ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే గత ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఓటు వేయడంతో ప్రజల బాధ్యత పూర్తికాదని, ప్రభుత్వ పనితీరులో ప్రజలు నిరంతరం భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, జెన్‌-జీ యువత కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, నటి త్రిష కృష్ణన్ కూడా చెన్నైలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె ముందు వరుసలో కూర్చున్నారు. విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చుని, అనంతరం పరేడ్ సమయంలో విజయ్‌కు సెల్యూట్ చేసిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement