తాతను చంపేందుకు సోషల్‌ మీడియాలో సెర్చ్‌.. బాలుడి కిరాతకం | Rajasthan boy murders grandfather over fight, searched methods to kill | Sakshi
Sakshi News home page

తాతను చంపేందుకు సోషల్‌ మీడియాలో సెర్చ్‌.. బాలుడి కిరాతకం

Aug 15 2026 11:30 AM | Updated on Aug 15 2026 11:41 AM

Rajasthan boy murders grandfather over fight, searched methods to kill

జైపూర్‌: రాజస్థాన్‌లో  విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో యువకుడు తన తాతను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మూటలో కట్టి నదిలో పడేశాడు. అయితే ఈ హత్య ఏలా చేయాలో తెలుసుకోవడానికి అతను సోషల్‌ మీడియాలో వెతికాడు. నది ఒడ్డున మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయిటపడింది.

పాలి జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా 16 ఏళ్ల బాలుడు తన 85 ఏళ్ల తాతను స్నేహితుడి సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని మూటలో కట్టి స్కూటర్‌పై నది సమీపానికి తీసుకెళ్లి నీటిలో పడేసినట్లు పేర్కొన్నారు. స్థానికులు నది సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఛాతిపై కత్తిపోట్లు ఉండటంతో పాటు గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించడంతో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కుటుంబ సభ్యులు వృద్ధుడు కనిపించకపోయినా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించడంతో బాలుడు ఆందోళనకు గురై చివరకు హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ హత్య కోసం బాలుడు  ఆన్‌లైన్‌లో హత్య చేసే పద్ధతులు, మెడపై ఎలా దాడి చేస్తే  ప్రాణాలు పోతాయనే అంశాలపై ఆ వెతికినట్లు దర్యాప్తులో గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి స్క్రూడ్రైవర్, కత్తితో తాతపై దాడి చేసి, మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టినట్లు బాలుడు చెప్పాడు. అనంతరం ఇద్దరూ ఆ సంచిని స్కూటర్‌పై నది సమీపానికి తీసుకెళ్లి మృతదేహాన్ని నీటిలో పడేసి తిరిగి ఇంటికి వచ్చి ఏమి తెలియనట్లు నిద్రపోయాడని పోలీసులు పేర్కొన్నారు.

సోషల్ మీడియా ద్వారా తండ్రి మరణించిన విషయం తెలుసుకున్న ముంబైలోని ఇద్దరు కుమారులు పోలీస్ స్టేషన్‌లో హత్యపై  ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి స్నేహితుడితో పాటు పొలంలో కాపలాదారుగా పనిచేసే 50 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. హత్యకు అసలు కారణం ఏమిటి, ఈ ఘటనలో ఇతరుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement