మహారాష్ట్రలోని నాందేడ్‌లోని మాతా సాహిబ్ గురుద్వారాను సందర్శించి బయటకు వస్తున్న శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గురువారం మధ్యాహ్నం జరిగిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్న బాదల్ సర్జరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మహారాష్ట్ర పోలీసు భద్రతా బృందానికి చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ వైజ్‌నాథ్ కేంద్రే సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే బాదల్ ఈ పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోగలిగారు. దీంతో పోలీసు అధికారి నెట్టింట విశేషంగా నిలుస్తున్నారు. సమయానికి స్పందించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్న ఇన్‌స్పెక్టర్ కేంద్రే , మహారాష్ట్ర పోలీసు బృందంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఎలా కాపాడారు?
గురుద్వారాలో పనిచేసే జస్పాల్ సింగ్ అనే నిహంగ్ సిఖ్, తన శాలువా కింద కిర్పాన్ (కత్తి) దాచుకుని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పొట్టలో పొడవడానికి యత్నించాడు. అయితే అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఇన్‌స్పెక్టర్ కేంద్రే క్షణాల వ్యవధిలో స్పందించి దుండగుణ్ని అడ్డుకుని కిందకు పడేసారు. ఈ క్రమంలో బాదల్ చేతికి స్వల్ప గాయమైంది. అలాగే ఇన్‌స్పెక్టర్ కేంద్రే చేతికి కూడా గాయమైంది. పోలీసులు వెంటనే నిందితుడు జస్పాల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
హరి సిమ్రత్ కౌర్ కృతజ్ఞతలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌స్పెక్టర్ కేంద్రేను సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భార్య హరి సిమ్రత్ కౌర్ సందర్శించి కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త ప్రాణాలు కాపాడినందుకు ప్రత్యుపకారంగా ఏదైనా చేయగలనా అని ఆమె ప్రశ్నించినపుడు "ఇది నా బాధ్యత. ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికే మాకు శిక్షణ ఇస్తారు. స్పందించడానికి నాకు క్షణకాలం మాత్రమే సమయం లభించింది, నా విధిని నేను నిర్వహించాను" అని కేంద్రే వినమ్రంగా బదులిచ్చారు.
ఎవరీ కేంద్రే
2001లో మహారాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన సంతోష్ కేంద్రే, ఆ తర్వాత ప్రమోషన్లు పొంది ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగారు.
ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్
మరోవైపు పంజాబ్‌ను స్వాధీనం చేసుకోవాలని, రాష్ట్రంలో శాంతిని భంగం చేయాలని చూస్తున్నారని, కానీ అకాలీదళ్ నేతగా ఆ పరిస్థితి రానివ్వబోనని సుఖ్‌బీర్ సింగ్ వెల్లడించారు. రెండు సార్లు పవిత్రమైన ప్రదేశాల్లో తనపై అటాక్ జరిగిందని, అయినా తానెప్పుడూ భయపడలేదని, ఇప్పుడూ భయపడలేదన్నారు. పంజాబీల సంక్షేమానికి శిరోమణి అకాలీదళ్ కట్టుబడి ఉందన్నారు. కాగా 2024 డిసెంబర్‌లో కూడా సుఖ్‌బీర్ బాదల్‌పై గోల్డెన్ టెంపుల్‌లో కూడా హత్యాయత్నం జరిగింది. ఈ రెండు ఘటనలనుంచి ఆయనపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్


