ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్‌లోనే అతడి చేత సింధూరం పెట్టించుకుంది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంటూ.. ఆ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.
బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 19 ఏళ్ల మానిషా కుమారి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. దిల్ఖుష్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడితో ఆమెకు ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మానిషా.. ప్రియుడు దిల్ఖుష్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఆగస్టు 10న దిల్ఖుష్ మానిషాను అరారియా నుంచి తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ పూర్ణియా జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు లేరు.. బంధువులు లేరు.. పెళ్లి సందడి లేదు. అయినా తమ ప్రేమే తమకు అండగా భావించిన ఆ జంట.. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పెళ్లి చేసుకున్నారు. దిల్ఖుష్ మానిషా పాపిట్లో సింధూరం పెట్టాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్దిసేపటికే కథ ఒక్కసారిగా మారిపోయింది.
పెళ్లి తర్వాత ఇద్దరూ రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గమధ్యంలో మానిషాకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి. దీంతో, ఆమెను హుటాహుటిన పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆసుపత్రిలో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫొటో దిగిన యువతి.. అదే రోజు విగతజీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునేలోపే.. ఆమె మరణవార్త కుటుంబానికి చేరింది.
మానిషాకు అకస్మాత్తుగా ఏమైంది?
ఎండ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేహాట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మానిషా భర్త దిల్ఖుష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి.. స్టేషన్‌లో జరిగిన పెళ్లి.. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం.. ఆసుపత్రిలో మృతి చెందడం వరకు జరిగిన మొత్తం పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ.. చివరకు రైల్వే స్టేషన్‌లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే.. అదే కథ విషాదంగా ముగిసింది.


