సోషల్ మీడియాలో ఓ తరం.. వీధుల్లో మరో శక్తి.. అంటూ జెన్ జీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. భారత్‌లోనూ పరీక్షల వ్యవహారాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యవస్థలపై ప్రశ్నలతో జెన్ జీ యువత ఆందోళనలు చేపట్టిన సందర్భాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అయితే పోరాటాలు, ట్రెండ్స్, సోషల్ మీడియా యాక్టివిజంతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ తరం.. తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు విషయంలో ఎలా వ్యవహరిస్తోంది?.. ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రావెల్, లైఫ్‌స్టైల్, ఎక్స్‌పీరియన్స్‌లకు ప్రాధాన్యం ఇచ్చే తరం అంటూ కనిపించే జెన్ జీ.. నిజ జీవితంలో మాత్రం డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందట!. భారీ కొనుగోళ్లు, విహారయాత్రల కంటే రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.
శాలరీసే(SalarySe) నిర్వహించిన ఈ అధ్యయనం కోసం 5.2 లక్షల మందికి పైగా జీతం పొందుతున్న Gen Z వినియోగదారుల యూపీఐ లావాదేవీలను విశ్లేషించారు. సాధారణంగా జెన్‌జీ అంటే ప్రయాణాలు, డిజిటల్ లైఫ్, అనుభవాల కోసం ఎక్కువ ఖర్చు చేసే తరం అనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ ఖర్చుల లెక్కలు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.
70 శాతం ఖర్చు.. ఈ ఐదు కేటగిరీలకే!
జెన్‌జీ తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ భాగం అవసరాలకే వెళ్తోంది. బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు అత్యధికంగా 20.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత కిరాణా సరుకుల కోసం 15.7 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సంబంధిత చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చవుతోంది. ఈ ఐదు విభాగాలు కలిపి నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా ఆక్రమిస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ లైఫ్ కంటే.. జీవితంలోని సాధారణ అవసరాలే వారి బడ్జెట్‌లో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నాయి.
ట్రావెల్‌కు కేవలం 5 శాతం
జెన్‌జీకు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం అనే ప్రచారం ఉన్నప్పటికీ.. వారి నెలవారీ ఖర్చుల్లో ట్రావెల్ వాటా కేవలం 5 శాతమేనని అధ్యయనం చెబుతోంది. ప్రయాణాలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నా.. అవి వారి రెగ్యులర్ బడ్జెట్‌ను పెద్దగా ప్రభావితం చేయడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే వినోదం, ప్రయాణాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
OTTలకు కూడా చోటు
డిజిటల్ వినోదానికి Gen Zలో ఆదరణ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సబ్‌స్క్రిప్షన్ ఖర్చుల్లో జియోహాట్‌స్టార్ 12.4 శాతంతో ముందంజలో ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ, ఆటోపే వంటి డిజిటల్ చెల్లింపు విధానాలు యువత ఆర్థిక అలవాట్లను మార్చుతున్నాయని అధ్యయనం పేర్కొంది. బిల్లులు ఆటోమేటిక్‌గా చెల్లించడం, సబ్‌స్క్రిప్షన్లు డిజిటల్‌గా కొనసాగడం వంటి విధానాలు Gen Z జీవితంలో సాధారణంగా మారాయి.
వయసు పెరిగేకొద్దీ..
అధ్యయనం 18–23 ఏళ్ల వయసు, 24–29 ఏళ్ల వయసు ఉన్న Gen Z గ్రూపులను కూడా పరిశీలించింది. ఆసక్తికరంగా.. ఇరు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చులు (డిస్క్రెషనరీ స్పెండింగ్) 32 శాతంగానే ఉన్నాయి. అయితే వయసు పెరిగేకొద్దీ అవసరాలపై ఖర్చు పెరుగుతోంది. 18–23 ఏళ్ల వయసు వారిలో అవసరాల ఖర్చు 50 శాతం ఉండగా.. 24–29 ఏళ్ల వయసు వారిలో అది 59 శాతానికి పెరిగింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఖర్చుల ప్రాధాన్యతలు మారుతున్నాయని ఇది సూచిస్తోంది.
డిజిటల్ ఫైనాన్స్ వైపు Gen Z
శాలరీసే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా ప్రకారం.. భారత జెన్‌జీ పూర్తిగా డిజిటల్ ఆధారిత ఆర్థిక జీవనశైలిని అభివృద్ధి చేసుకుంటోంది. యూపీఐ విస్తృతి కారణంగా డబ్బు నిర్వహణ, చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.
మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియాలో కనిపించే ట్రావెల్, లైఫ్‌స్టైల్ ఇమేజ్‌కు భిన్నంగా జెన్‌జీ వాస్తవ ఖర్చుల తీరు కనిపిస్తోంది. కలలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక భద్రతకే యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.


