బెంగళూరు: నిన్న ఆగస్టు 12(బుధవారం) అమావాస్య. శ్రావణమాసంలో వచ్చే ఈ అమావాస్యను కన్నడనాట భీమన అమావాస్యగా పిలుస్తుంటారు. ఈ రోజు కన్నడనాట కలకలం చెలరేగే ఘటన చోటుచేసుకుంది... జూలై 30, 2000 వ సంవత్సరం.. రాష్ట్రమంతా భీమన అమావాస్య వేడుకల్లో నిమగ్నమై ఉన్న వేళ, కన్నడ చలనచిత్ర రత్నం, అభినవ భార్గవ డాక్టర్ రాజ్‌కుమార్ కిడ్నాప్ ఉదంతం కర్ణాటక చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. గజనూరులోని తన ఫామ్‌హౌస్‌లో బోరు బావి పనులు చూసుకునేందుకు వెళ్లిన రాజ్‌కుమార్‌ను అడవి గజదొంగ వీరప్పన్ బందీగా చేసుకున్నాడు. రాత్రి 9:30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు, రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు.
అతని భార్య పార్వతమ్మకు ఒక ఆడియో క్యాసెట్‌ను అప్పగించి, ‘అయ్యా, పదండి’ అంటూ ఆయన్ని అడవుల్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కర్ణాటక ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకున్న పార్వతమ్మ, ఆ క్యాసెట్ అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆ తర్వాత మొదలైన 108 రోజుల కిడ్నాప్ ఉదంతం, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారింది. జర్నలిస్టు ఆర్ఆర్ గోపాల్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, అడవిలోకి పలుమార్లు వెళ్లి చర్చలు జరిపారు. రాజ్‌కుమార్ అపహరణతో కర్ణాటకలో వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. అభిమానులు రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు.
అయితే అడవిలో బందీగా ఉన్న సమయంలో కూడా రాజ్‌కుమార్ చాలా ప్రశాంతంగా యోగా, ప్రాణాయామం చేసుకునేవారని, ఆయన నిబ్బరం వీరప్పన్‌ను సైతం ఆకట్టుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుదీర్ఘ చర్చలు, ఉత్కంఠభరిత పరిణామాల అనంతరం, 108 రోజుల తర్వాత నవంబర్ 15, 2000న రాజ్‌కుమార్ క్షేమంగా విడుదలయ్యారు. ఆయన రాకతో కర్ణాటక ప్రజల్లో ఆనందోత్సాహాలు నిండాయి. ఈ ఘటనపై 2013లో ‘అత్తహాస’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పటికీ భీమన అమావాస్య వచ్చిందంటే, ఆ 108 రోజుల ఆందోళన, ప్రజల ఆవేదన అందరికీ గుర్తుకు వస్తుంది.


