రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్‌అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.
సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్‌గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.
మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?
రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.
అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు.
అయితే ప్రదోష్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్‌గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.
రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్‌కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.


