బీజేపీకి సంతోషం కలిగించే మాటలొద్దు! | Tharoor CJP Comparison Rattles Congress: High Command Sounds Alert | Sakshi
Sakshi News home page

బీజేపీకి సంతోషం కలిగించే మాటలొద్దు!

Aug 10 2026 7:45 AM | Updated on Aug 10 2026 7:59 AM

Tharoor CJP Comparison Rattles Congress: High Command Sounds Alert

కాంగ్రెస్‌లో జెన్‌జీ రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. పార్టీ లైన్‌ను దాటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన పేరును ప్రస్తావించకుండా వార్నింగ్‌ ఇచ్చింది. బీజేపీని సంతోష పెట్టేలా మాట్లాడడం మానుకుంటే మంచిదంటూ సూచనలు చేసింది. 

రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘యువత కార్యక్రమం’ కంటే.. కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నిరసనలు జెన్‌జీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని థరూర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పందించింది. కేరళ కాంగ్రెస్‌ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ నేతల వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడేలా ఉండకూడదని పరోక్షంగా హెచ్చరించారు.

థరూర్‌ వ్యాఖ్యలపై స్పందించిన వేణుగోపాల్‌.. ఆ వ్యాఖ్యలను తాను పూర్తిగా వినలేదని, మీడియా కథనాల ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. “కాంగ్రెస్‌ నేతలు పార్టీ విధానాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండకపోయినా.. బీజేపీని సంతోషపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. రాహుల్‌ గాంధీపై విమర్శలు వస్తే బీజేపీకి అది రాజకీయంగా లాభిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే థరూర్‌ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.

జెన్‌జీపై రాహుల్‌ ప్రచారాన్ని సమర్థించిన కాంగ్రెస్‌
ఇదే సమయంలో రాహుల్‌ గాంధీ చేపట్టిన యువత కార్యక్రమాలను వేణుగోపాల్‌ గట్టిగా సమర్థించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్‌ కార్యక్రమానికి వచ్చిన వారు సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలు కాదని.. నిజమైన జెన్‌జీ యువతేనని పేర్కొన్నారు. కోటా, డెహ్రాడూన్‌లలోనూ ఇదే తరహా స్పందన వచ్చిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాహుల్‌ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.

అసలు థరూర్‌ ఏమన్నారు?
మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్‌.. రాహుల్‌ గాంధీ “ఛాత్రోంకీ గూంజ్‌” కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ కార్యక్రమం లేవనెత్తిన అంశాలే CJP నిరసనల్లోనూ ఉన్నాయని.. అయితే జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన CJP ఆందోళన స్థాయిలో కాంగ్రెస్‌ కార్యక్రమం ఎందుకు ప్రభావం చూపలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. “మనం యువత గొంతు విన్నామా? జెన్‌జీ నాడిని పట్టుకోగలిగామా?” అంటూ థరూర్‌ ప్రశ్నించారు.

అయితే తన వ్యాఖ్యలు పార్టీపైనో, లేదంటే రాహుల్‌ గాంధీపై దాడి కాదని తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్పానని తెలిపారు.

సీజేపీ ప్రభావంపై రాజకీయ చర్చ
నీట్‌ పరీక్ష అంశాలు, విద్యార్థుల సమస్యలపై కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అదే సమయంలో యువత సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాయన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. థరూర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీయగా.. వేణుగోపాల్‌ స్పందనతో పార్టీ నాయకత్వం రాహుల్‌ గాంధీ యువత కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement