జూలై 27న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2027 భాగస్వామ్య లేదా ప్రాతి నిధ్య నివేదిక భారత ఉన్నత విద్యకు ఒకేసారి ఆశాజనకమైన చిత్రాన్నీ, ఆందోళన కలిగించే వాస్తవాన్నీ చూపించింది. ప్రపంచంలోని 118 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,297 విశ్వవిద్యాల యాలు ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో పాల్గొనగా, 143 విశ్వవిద్యాల యాలతో భారత్ ప్రపంచంలో రెండో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది.
ఎక్కువ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్‌లో పాల్గొ నడం ఒక విషయం అయితే, ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి స్థానాలను సాధించడం మరో విషయం. అందుకే ఈ సందర్భంలో ‘రాశి కంటే వాసి ముఖ్యం’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రాతినిధ్యం పెరగడం మాత్రమే కాదు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అందు కోవడమే నిజమైన విజయానికి కొలమానం.
గత ఐదేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాలు టీహెచ్‌ఈ ర్యాంకింగ్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నా, నాణ్యతలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రపంచ టాప్–100లో మనం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, ఉన్నత విద్యా సంస్థగానీ స్థానం సంపాదించలేక పోవడం ఆలోచించాల్సిన విషయం. ఎక్కువ శాతం 300–500 బ్యాండ్లలో లేదా అంతకంటే దిగువనే నిలుస్తున్నాయి.
ఎక్కడ వెనుకబడ్డాం?
భారతీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మూడు అంశాల్లో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయీ కరణ– విదేశీ విద్యార్థులు, విదేశీ అధ్యాపకుల సంఖ్య అత్యల్పంగా ఉండడం వల్ల ప్రపంచ అనుసంధానం పరిమితమవుతోంది. రెండవది ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తి. ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యా లయాల్లో ఒక్కో అధ్యాపకుడికి తక్కువ మంది విద్యార్థులు ఉండగా, మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. మూడవది పరిశోధన ప్రభావం– పరిశోధనా పత్రాల సంఖ్య పెరుగుతున్నా, వాటికి అంత ర్జాతీయ సైటేషన్లు రావడం, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వా మ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాల్లో ఇంకా గణనీయ మైన లోటు ఉంది. దీనికి తోడు దేశం మొత్తం పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై జీడీపీలో కేవలం 0.6–0.7 శాతం మాత్రమే వ్యయం చేస్తుండగా, అందులో ఉన్నత విద్యా సంస్థల వాటా 8–9 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం అంత సులభం కాదు.
తూర్పు ఆసియా దేశాల అనుభవం భారత్‌కు విలువైన పాఠాన్ని చెబుతోంది. చైనా తక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాల తోనే త్సింగ్‌వా, పెకింగ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రపంచ అగ్రశ్రేణి స్థానాలకు చేర్చింది. సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచ టాప్–20లో స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ దేశాలు ప్రాతినిధ్య సంఖ్యల కంటే నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వా మ్యాలు, ప్రతిభావంతులైన అధ్యాపకులు, దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టు బడులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థిరమైన విజయాలను అందుకుంటున్నాయి.
భారత్ కూడా ఇదే దిశగా మరింత దృఢమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలు సాకారం కావాలంటే, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అధిక నిధులు కేటాయించడం, అంతర్జాతీయ అధ్యాపకులను, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ భాగస్వా మ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరం.
– ఏటూరి శేఖర్ శర్మ, రిటైర్డ్ జిల్లా విద్యాధికారి


