హైదరాబాద్ : గల్లీ గల్లీ కదిలింది. భాగ్య నగరం ఆధ్యాత్మిక తరంగమై ఎగిసింది. బోన సంబరం భువన సందడిని తలపించింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయమైతే భక్తజన సంద్రమై ఉప్పొంగింది.
నెత్తిన బోనంతో ఆడపడుచుల సంబరం అంబరమంటింది. యువత ఉరిమే ఉత్సాహంతో చిందులేసింది.
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నగర వ్యాప్తంగా ఉత్సవ జాతర కనిపించింది.
పోతురాజుల విన్యాసాలు.. కళాకారుల ఆటాపాటలతో హోరెత్తింది.
అమ్మవారి కీర్తనలతో భక్తిభావం పరిమళించింది.
మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


