ఒమన్‌లో యూపీ యువకుడు మృతి.. స్వగ్రామంలో విషాదం! | 23 Year Old Indian Youth Killed in Oman Airstrike | Sakshi
Sakshi News home page

ఒమన్‌లో యూపీ యువకుడు మృతి.. స్వగ్రామంలో విషాదం!

Sep 24 2026 12:58 PM | Updated on Sep 24 2026 1:34 PM

23 Year Old Indian Youth Killed in Oman Airstrike

దేవరియా: ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాకు చెందిన 23 ఏళ్ల సూరజ్ యాదవ్ ఒమన్‌లో జరిగిన దాడిలో మృతి చెందారు. ఒమన్ తూర్పు తీరంలో ఓ నౌకపై జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో సుమారు నెలన్నర క్రితమే సూరజ్ ఒమన్ వెళ్లాడు. ఆయన మరణవార్తతో కరమాజీత్‌పూర్ గ్రామంలో విషాదం నెలకొంది.

గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమాజీత్‌పూర్ గ్రామానికి చెందిన సూరజ్.. ఓం ప్రకాశ్ యాదవ్, పుష్పాదేవి దంపతుల నలుగురు కుమారుల్లో పెద్దవారు. 12వ తరగతి చదువు పూర్తిచేసిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సుమారు నెలా పది రోజుల క్రితం విమానంలో ఒమన్ చేరుకున్నాడు. అయితే అక్కడ జరిగిన హవాయి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

సూరజ్ మరణవార్త తెలియడంతో ఆయన తల్లి పుష్పాదేవి, నాయనమ్మ పానాదేవి, తాత రమా యాదవ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సూరజ్‌కు ఇంకా వివాహం కాలేదు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సూరజ్ తండ్రి ఓం ప్రకాశ్ యాదవ్ మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే స్వగ్రామానికి బయలుదేరారు. ఇంట్లో సూరజ్‌తో పాటు ఆయన ముగ్గురు తమ్ముళ్లు సన్నీ, సమీర్, సాహిల్ ఉంటున్నారు. సన్నీ 10వ తరగతి, సమీర్ 9వ తరగతి చదువుతున్నారు. చిన్నవాడు సాహిల్ కూడా ప్రస్తుతం పాఠశాలలోనే చదువుతున్నాడు.

సూరజ్ మృతిచెందిన విషయం తెలియడంతో గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబాన్ని పరామర్శించేందుకు వారి ఇంటికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. సమాచారం అందుకున్న గౌరీబజార్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సూరజ్ మామ అవధేశ్ యాదవ్ మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు, మంచి జీవితం కోసం సూరజ్ విదేశాలకు వెళ్లారని తెలిపారు. సూరజ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని  అధికారులను కోరారు. కుటుంబ సభ్యులు చివరి సంస్కారాలు నిర్వహించుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: నేపాల్‌ వరదలు.. ఇప్పటికీ ఆచూకీలేని 800 మంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement