బిహార్ వరుస లైంగిక వేధింపుల ఘటనలు.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జమయి జిల్లాలో పదో తరగతి బాలికపై వేధింపుల ఘటన మరువక ముందే.. సమస్తిపూర్‌లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్న వేళ.. జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా.. అలీనగర్ బీజేపీ ఎమ్మెల్యే, భజన గాయని మైథిలీ ఠాకూర్ ఎప్పటిలాగే ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ‘‘ఒకప్పుడు సాయంత్రం 6 దాటితే బయట తిరిగేందుకు భయపడేవాళ్లం. ఇప్పుడు నేను ధైర్యంగా అర్ధరాత్రి 3గం. సమయంలోనూ బిహార్‌లో తిరగగలుగుతున్నా’’ అంటూ ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మాట్లాడింది. జమయి ఘటన నేపథ్యంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.
అయితే మైథిలి పేరును ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు. దర్బంగా ప్రజలు ఆమెను ఐకాన్‌గా భావించి ఓట్లు వేసి గెలిపించారని.. అయితే ఆమె మాత్రం అంబానీ కుటుంబ గణేశ్ ఉత్సవంలో ప్రదర్శన ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మైథిలి నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు నెలకొన్నాయని.. వరదలతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆమె పట్టించుకోవడం లేదని మండిపడ్డారాయన.
మీరో ఎమ్మెల్యే అందుకే రాత్రిళ్లు..
బిహార్‌లో మహిళల భద్రతపై మైథిలీ ఠాకూర్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు. ఆమె ఎమ్మెల్యే కావడంతో రాత్రిపూట బయట తిరగగలుగుతున్నారని.. కానీ సాధారణ బాలికలు, మహిళలకు అదే స్థాయిలో భద్రత ఉందా? అని ప్రశ్నించారు. సాధారణ అమ్మాయిలు రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందని, ఇప్పుడు అబ్బాయిలు కూడా రాత్రి బయటకు వెళ్లేముందు రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘వీడియో వైరల్ కాకపోతే.. ఘటన ఎలా బయటపడేది?’
జముయి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంపైనా ప్రశాంత్ కిషోర్ పోలీసుల తీరును ప్రశ్నించారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చర్యల గురించి మాట్లాడుతున్నారని.. కానీ ఆ వీడియో బయటకు రాకపోతే అసలు ఘటన వెలుగులోకి వచ్చేదెలా? అని ప్రశ్నించారు. బాధితులు తొలుత అధికారులను సంప్రదించకపోవడంతో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియో ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
‘చేసిన వారిపై చర్యలేవి?’
వీడియోను ప్రసారం చేసిన వారిపై చర్యల గురించి మాట్లాడటానికి బదులుగా.. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే ముఖ్యమని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బిహార్‌లో మద్యం, ఇసుక మాఫియాలకు రాజకీయ రక్షణ ఉందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు.
‘బేటీ బచావో.. బేటీ పడావో’పైనా సెటైర్
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఇకపై అమ్మాయిలను వారే చదివించుకోవాలి, వారే కాపాడుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మైథిలీ ఠాకూర్(25) బిహార్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని. భోజ్‌పురి, హిందీ పాటలతో పాటు భక్తి భజన గీతాలతో గాయనిగా గుర్తింపు పొందారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సంగీత ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ఉన్నట్లుండి ఏమైంది?.. ఎమ్మెల్యే రాజీనామాతో కలకలం


