సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. దువ్వూరు వద్ద పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన ఎర్రచందనం స్మగ్లర్లు జాకీర్, సుధాకర్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో వీరికి గాయాలు కావడంతో జాకీర్, సుధాకర్‌ను చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కాగా, దువ్వూరు వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన చాపాడు పోలీసులకు అక్కడ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లు జాకీర్, సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఎర్రచందనం డంప్ ఎక్కడ ఉందో చూపించేందుకు వీరిని తీసుకెళ్తుండగా దువ్వూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆత్మరక్షణ కోసం ఇద్దరిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ ఘటనలో గాయపడిన జాకీర్, సుధాకర్‌ను చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. జాకీర్‌పై హత్యాయత్నం (307) కేసుతో పాటు మరో 10 కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో అతడు కీలక నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాటి తరలింపునకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: జనసేన నేతపై గన్‌తో దాడి..


