కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై సుప్రీంకోర్టు సీరియస్
డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్ జోన్ ఏసీపీ పాత్రపై దర్యాప్తు జరగాల్సిందే
కిందిస్థాయి అధికారులపై నెట్టేసి ఉన్నతాధికారులు తప్పించుకోలేరు
ప్రాథమిక ఆధారాలు పరిశీలిస్తే ఏదో తీవ్రతప్పిదం జరిగినట్లు స్పష్టమవుతోంది
కస్టడీలో వ్యక్తి కనిపించకుండా పోతే.. అంతకన్నా తీవ్రమైన చట్ట ఉల్లంఘన ఇంకేముంటుంది?
స్టేషన్‌లో నెల రోజుల పాటు సీసీటీవీలు పనిచేయకపోతే పోలీసులు నిద్రపోతున్నారా?
ఇక ఈ కేసును మేమే పర్యవేక్షిస్తాం
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై సుప్రీంను ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి
ఎంపీ ఫిర్యాదుపై విచారణ జరుపుతూ సుప్రీం సంచలన వ్యాఖ్యలు
ఎన్‌బీడబ్ల్యూ అమలు పని స్థానిక పోలీసులది కదా?.. మరి సాయికృష్ణ కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఎందుకు పంపారు?
మే 28న తల్లి ఫిర్యాదు చేస్తే.. జూన్ 19న కేసు నమోదు చేస్తారా?
ఈ అసాధారణ జాప్యమే ఏం జరిగిందో చెబుతోంది
ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని ప్రాథమికంగా నిర్ణయం
సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన వ్యాజ్యాల స్థితిగతులేంటో చెప్పండి
ఇరుపక్షాలకు సుప్రీంకోర్టు ఆదేశం.. విచారణ వాయిదా
పోలీస్ స్టేషన్‌లో ఏకంగా నెల రోజుల పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఏసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? గాఢంగా నిద్రపోతున్నారా? కస్టడీలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతే మే 28న బాధితుడి తల్లి ఫిర్యాదు చేసినా జూన్ 19 వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఈ అసాధారణ జాప్యమే ఏం జరిగిందో స్పష్టంగా చెబుతోంది. ఒక సాధారణ నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేయడానికి స్థానిక పోలీసులు కాకుండా, ఏకంగా కమిషనర్ పరిధిలో పనిచేసే టాస్క్‌ఫోర్స్ బృందం ఎందుకు వెళ్లింది. కేవలం కింది స్థాయి సిబ్బందిపై నెపం నెట్టేసి ఉన్నతాధికారులు తప్పించుకోలేరు. ఈ వ్యవహారంలో పై అధికారుల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే. పోలీసు కస్టడీలో ఓ పౌరుడు మృతి చెందడం ముమ్మాటికీ చట్టవ్యతిరేక చర్యే. ఈ కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఇంప్లీడ్ చేస్తాం. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. తదుపరి విచారణలో సీబీఐని ఈ కేసులో ప్రతివాదిగా చేర్చే విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటాం.ఈ లాకప్‌డెత్ కేసు విచారణను ఇకపై నేరుగా మేమే పర్యవేక్షిస్తాం. ఏపీ హైకోర్టులో డీజీపీ, సీపీ, ఏసీపీ దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల స్థితిగతులను తెలుసుకుని మాకు చెప్పాలి.
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కాపు యువకుడు గాదె సాయికృష్ణను చంపేసి, గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తగలబెట్టేసి, కనీసం చితాభస్మం కూడా దక్కకుండా చేసిన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, సౌత్ జోన్ ఏసీపీ మానస పాత్రపై సమగ్ర విచారణ జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లాకప్‌డెత్ వ్యవహారంలో వారి పాత్ర ఏంటో తేలుస్తామంది. ఇంత పెద్ద ఘాతుకానికి కింది స్థాయి అధికారులే బాధ్యులని చెప్పి, తప్పును వారిపై నెట్టేస్తారా అని ప్రశ్నించింది. అలా నెట్టేసినంత మాత్రాన ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలు పరిశీలిస్తే ఈ వ్యవహారంలో ఏదో తీవ్రమైన తప్పిదం జరిగినట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. ఉన్నతాధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. కేవలం కింది స్థాయి అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదంది. ఈ లాకప్ డెత్ విషయంలో నిజా నిజాలను నిగ్గు తేలుస్తామని స్పష్టం చేసింది.
నెల రోజులు సీసీకెమెరాలు పనిచేయకపోతే నిద్రపోతున్నారా?
పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఓ పౌరుడు ఇప్పటి వరకు కనిపించలేదంటే, ఇంత కన్నా తీవ్రమైన చట్ట ఉల్లంఘన ఏదీ ఉండదని తేల్చి చెప్పింది. అంతేకాక ఇది ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమైన చర్యేనని వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్‌లో నెల రోజుల పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే నిద్రపోతున్నారా? అంటూ ఉన్నతాధికారులపై నిప్పులు చెరిగింది. కస్టడీలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో సుదీర్ఘ జాప్యం ఎందుకు జరిగింది? అని వారిని నిలదీసింది. మే 28న సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేస్తే, జూన్ 19 వరకు కేసు నమోదు చేయలేదని, ఈ అసాధారణ జాప్యమే ఏం జరిగిందో స్పష్టంగా చెబుతోందని వ్యాఖ్యానించింది. ఇకపై ఈ కేసును తామే పర్యవేక్షిస్తామని తెలిపింది. ఇదే సమయంలో ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని కూడా సుప్రీంకోర్టు ప్రాథమికంగా నిర్ణయించింది.
ఆ వ్యాజ్యాలన్నీ మేమే విచారిస్తాం..
సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ కమిషనర్ రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ మానస తదితరుల పాత్ర ఉందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కింది కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మూడు వ్యాజ్యాలను తమకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఎవరెవరు పిటిషన్లు వేశారు.. వాటి స్థితిగతులు ఏంటి? అన్న వివరాలపై స్టేటస్ రిపోర్ట్‌ను తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. అలాగే సాయికృష్ణ అదృశ్యంపై తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్, సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌లకు సంబంధించిన స్థితిగతులను కూడా తెలియచేయాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం మొదటి కేసుగా దీనిని విచారిస్తామని తెలిపింది. ఇదే సమయంలో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తునకు సంబంధించిన అన్ని రికార్డులను ఈ నెలాఖరు లోపు తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. అంతేకాక గురుమూర్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముగ్గురు ఉన్నతాధికారులపై ఎంపీ గురుమూర్తి న్యాయ పోరాటం...
కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం.మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి విజయవాడ రెండో అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సాయికృష్ణ అక్రమ నిర్భంధం, లాకప్ డెత్, మృతదేహం, చితాభస్మం మాయం చేసిన వ్యవహారంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం.మానసల పాత్ర ఉందని, వారికి అన్ని విషయాలు తెలుసునని, అందువల్ల వారిని నిందితులుగా చేర్చాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు, ఫిర్యాదిదారు అయిన గురుమూర్తిని వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఆదేశించింది. అలాగే ఆ రోజున సాక్షుల వాంగ్మూలాలను సైతం నమోదు చేస్తామని తెలిపింది.
విజయవాడ కోర్టు నిర్ణయంతో కంగుతిన్న ముగ్గురు అధికారులు...
విజయవాడ కోర్టు నిర్ణయంతో డీజీపీ, విజయవాడ కమిషనర్, ఏసీపీలు కంగుతిన్నారు. వాంగ్మూలాలు నమోదు చేస్తే సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని భావించిన ఈ ముగ్గురు ఉన్నతాధికారులు కూడా విజయవాడ కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎంపీ గురుమూర్తి విజయవాడ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ గత ఆగస్టు 13న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన గురుమూర్తి
హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ గురుమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ వాదనలు వినిపించారు.
అందరూ కలిసి సాయికృష్ణను చంపేశారు...
పిటిషనర్ ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ వాదనలు వినిపిస్తూ.. ‘ఓ పాత కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) అమలు పేరుతో మే 6వ తేదీన సాయికృష్ణను మార్కాపురంలో టాస్‌్కఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఎన్‌బీడబ్లు్య ఉత్తర్వులను అమలు చేయాల్సింది స్థానిక పోలీసులు. ఇందులో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. అయితే విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు పరిధిలో పనిచేస్తున్న టాస్‌్కఫోర్స్ సిబ్బంది సాయికృష్ణను పట్టుకొచ్చారు. కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. సాయికృష్ణను నిబంధనల ప్రకారం కోర్టు ముందు హాజరుపరచలేదు. ఆ తరువాత ఆ యువకుడు ఏం అయ్యారో ఎవరికీ తెలియదు. స్టేషన్‌లోనే చిత్రహింసలు పెట్టి హత్య చేసి, శవాన్ని తగులబెట్టేశారు. కనీసం చితాభస్మం కూడా లేకుండా దారుణానికి పాల్పడ్డారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ మొత్తాన్ని తుడిచిపెట్టేశారు.’ అని గోయల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
తప్పు చేయకుంటే..హైకోర్టుకెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నట్లు..?
‘మే 28న బాధిత యువకుడి తల్లి నేరుగా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదు. పోరాటం చేయగా చేయగా, జూన్ 19న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఉన్నతస్థాయి అధికారుల ఆమోదం లేకుండా ఓ వ్యక్తిని చంపేసి, కాల్చేసి, చితాభస్మం కూడా లేకుండా చేసే ధైర్యం కింది స్థాయి అధికారులకు ఉండే అవకాశమే లేదు. అంతా కూడా డీజీపీ, విజయవాడ కమిషనర్, సౌత్ ఏసీపీలకు తెలిసే జరిగింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విజయవాడ కోర్టు నిర్ణయిస్తే, దానిపై ఈ ముగ్గురు కూడా హైకోర్టుకెళ్లి మొత్తం ప్రక్రియను ఆపేయించారు. తప్పు చేయకుంటే హైకోర్టుకెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారు? న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం సడలకుండా ఉండాలంటే ఈ ముగ్గురు అధికారుల పాత్రపై ఈ కోర్టు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.’ అని గోయల్ ధర్మాసనానికి వివరించారు.
సాయికృష్ణ ఆచూకీ తెలియదని హైకోర్టునే తప్పుదోవ పట్టించారు...
‘సాయికృష్ణ అదృశ్యంపై ఆయన తల్లి గాదె విజయలక్ష్మి ఏపీ హైకోర్టులో జూన్ 4న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు పోలీసుల వివరణ కోరింది. సాయికృష్ణ ఆచూకీ తెలియదని, ఆచూకీ కోసం గాలిస్తున్నామంటూ పోలీసులు హైకోర్టునే తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. ఇవన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారుల పాత్రను సూచిస్తున్నాయి. కేవలం దిగువ స్థాయి పోలీసులపైనే చర్యలు తీసుకుని ఉన్నతాధికారులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది.’ అని గోయల్ కోర్టుకు తెలియచేశారు.
సిట్ ఏర్పాటు చేశాం...
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపిస్తూ.. సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతోందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఎస్‌హెచ్‌ఓగా ఉన్న ప్రధాన నిందితుడైన కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు, మరో ప్రైవేట్ వ్యక్తి సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపాం. చార్జిషీట్ కూడా దాఖలు చేశాం. సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనలో కింది స్థాయి అధికారులదే పూర్తి బాధ్యత. ఉన్నతస్థాయి అధికారుల ప్రమేయం ఏమీ లేదు‘ అని వాదించారు.
హైకోర్టు విచారణపై స్టే..
గురుమూర్తి ఫిర్యాదు మేరకు విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను తమకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ కేసుల రికార్డులను వెంటనే తమ రిజిస్ట్రీకి పంపాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ముగిసే వరకు ముగ్గురు ఉన్నతాధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఎలాంటి విచారణ జరపరాదని ఏపీ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు విచారణపై స్టే విధించింది. లాకప్‌డెత్ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు, ఇతర రికార్డులన్నింటినీ ఈనెల 30లోపు సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. గురుమూర్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలకు నోటీసులు జారీ చేసింది.
సీబీఐని ప్రతివాదిగా చేరుస్తాం...
ఈ కస్టోడియల్ డెత్ వ్యవహారంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఇంప్లీడ్ చేస్తామంది. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణలో సీబీఐని ఈ కేసులో ప్రతివాదిగా చేర్చే విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇకపై సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును మేమే పర్యవేక్షిస్తాం...
ఈ లాకప్‌డెత్ కేసు విచారణను ఇకపై నేరుగా తామే పర్యవేక్షిస్తామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టులో డీజీపీ, సీపీ, ఏసీపీ దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల స్థితిగతులను తెలుసుకుని తమకు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసిందని సిద్దార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. తమ ముందు ఉన్నతాధికారులపై పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ (సాయికృష్ణ తల్లి) వేర్వేరు వ్యక్తులు కదా అని ప్రశ్నించింది. ముగ్గురు ఉన్నతాధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల వివరాలతో స్టేటస్ రిపోర్టును గురువారం ఉదయం 10.30 గంటల కల్లా తమ ముందు ఉంచాలని పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఉన్నతాధికారులను బాధ్యులను చేయరాదని రోహత్గీ వాదన
ఉన్నతాధికారుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ‘పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎస్‌హెచ్‌ఓ, ఇతర కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పులకు డీజీపీ, సీపీ స్థాయి ఉన్నతాధికారులను బాధ్యులను చేయడం సరికాదు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనడం చట్టవిరుద్ధం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదు.’ అని తెలిపారు.
మరి సీసీ కెమెరాలు పనిచేయకపోతే గాఢంగా నిద్రపోతున్నారా?
ఈ వాదనలపై త్రిసభ్య ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్‌లో ఏకంగా నెల రోజుల పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఏసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వీరంతా గాఢంగా నిద్రపోతున్నారా?‘ అని కోర్టు నిలదీసింది. కస్టడీలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతే మే 28న బాధితుడి తల్లి ఫిర్యాదు చేసినా జూన్ 19 వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఒక సాధారణ నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేయడానికి స్థానిక పోలీసులు కాకుండా, ఏకంగా కమిషనర్ పరిధిలో పనిచేసే టాస్‌్కఫోర్స్ బృందం ఎందుకు వెళ్లింది. కేవలం కింది స్థాయి సిబ్బంది (ఇన్‌స్పెక్టర్ తదితరులు)పై నెపం నెట్టేసి ఉన్నతాధికారులు తప్పించుకోలేరంది. ఈ వ్యవహారంలో పై అధికారుల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసు కస్టడీలో ఓ పౌరుడు మృతి చెందడం ముమ్మాటికీ చట్టవ్యతిరేక చర్యేనని మండిపడింది.


