2024లో విజయవాడలోని జాతీయ రహదారిని ముంచెత్తిన ఫ్లాష్ ఫ్లడ్
ప్రపంచాన్ని వణికిస్తున్న ఫ్లాష్ ఫ్లడ్స్
హిమాలయాలు, పశ్చిమ తీరం ప్రధాన హాట్‌స్పాట్లు
వర్షాకాలంలోనే 75శాతం ఫ్లాష్ ఫ్లడ్స్
అసోంలో 5 లక్షల మందిపై వరద ప్రభావం
స్పెయిన్‌లో 16 గంటల్లో 771.8 మి.వీు.వర్షం
ప్రపంచంలో 1.81 బిలియన్ల మందికి వరద ముప్పు
ఏపీలో వాయుగుండం నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు
సాక్షి, అమరావతి: ఒక్కసారిగా భారీ వర్షం.. క్షణాల్లో వాగులు ఉప్పొంగుతాయి.. కొద్దిసేపటికే రహదారులు, వాగులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతాయి. ఇళ్లలోకి వరద నీరు దూసుకొస్తుంది. తప్పించుకునే అవకాశం కూడా ఉండదు.. ఇదే ఫ్లాష్ ఫ్లడ్స్. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ప్రకారం ప్రపంచంలోని వరద ఘటనల్లో సుమారు 85 శాతం ఫ్లాష్ ఫ్లడ్స్‌గా నమోదయ్యాయి. ఇతర రకాల వరదలతో పోల్చితే వీటివల్ల మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది.
ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.4.78 లక్షల కోట్లకు (50 బిలియన్ డాలర్లు) పైగా ఆర్థిక నష్టం జరుగుతున్నట్లు డబ్ల్యూఎంఓ పేర్కొంది. ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి వర్షపాతం, నేలలో తేమ, నీటి ప్రవాహం వంటి అంశాలను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పరిగణనలోకి తీసుకుంటోంది. ఇటీవల మన దేశంలోనూ ఫ్లాష్ ఫ్లడ్స్ తరచూ విజృంభిస్తున్నాయి. ఇక ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రవేశిస్తున్నాయి. తాజాగా ఏర్పడ్డ వాయుగుండం నేపథ్యంలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
భారీ వర్షాలతో ముప్పు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా బుధవారం, గురువారం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ఆకస్మిక వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు, వాగులు వేగంగా పొంగే ప్రమాదం పెరుగుతుంది. సాధారణ వరదలకు, ఫ్లాష్ ఫ్లడ్స్‌కు ప్రధాన తేడా వేగం. తీవ్రమైన వర్షం మొదలైన కొద్ది గంటల్లోనే నీటి మట్టం ఒక్కసారిగా పెరగవచ్చు. వాగులు, చిన్న నదులు, కాలువలు పొంగిపొర్లడంతో రహదారులు, ఇళ్లు, వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయి. వర్షం ఇప్పటికే కురిసిన ప్రాంతాల్లో నేల తడిగా ఉండటం వల్ల తర్వాత కురిసే భారీ వర్షపు నీరు వేగంగా ప్రవహించే అవకాశం ఉంటుంది.
వేసవిలోనూ ఫ్లాష్ ఫ్లడ్స్..
2025లో ప్రచురితమైన భారత ఉపఖండంపై విస్తృత అధ్యయనం ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. హిమాలయాలు, పశ్చిమ తీరం, మధ్య భారతం ప్రధాన ఫ్లాష్ ఫ్లడ్ హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ముఖ్యంగా దాదాపు మూడు వంతుల ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్రమైన వర్షం, ముందే తడిగా ఉన్న నేల కలయికతో సంభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భారత్‌లో నమోదైన ఫ్లాష్ ఫ్లడ్స్‌లో 75 శాతానికి పైగా జూన్–సెప్టెంబర్ మధ్య సంభవించాయి. ఏపీలో మాత్రం ఏప్రిల్–మే (వేసవి)లోనూ ఫ్లాష్ ఫ్లడ్స్ నమోదవుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఇదే అధ్యయనం మరో విషయాన్ని కూడా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లోనూ తీవ్రమైన వర్షాల సంఖ్య, తీవ్రత పెరుగుతున్నందున భవిష్యత్తులో కొత్త ప్రమాద ప్రాంతాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
భారత్‌లో ఆకస్మిక వరదలు..
కేంద్ర జల సంఘం 1986–2022 మధ్య ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చేసిన అధ్యయనం ప్రకారం దేశంలో సుమారు 21 మిలియన్ హెక్టార్ల ప్రాంతం వరదల ప్రభావానికి గురైంది. మరో 20.5 మిలియన్ హెక్టార్ల ప్రాంతాన్ని వివిధ వరద నియంత్రణ చర్యల ద్వారా రక్షించినట్లు అంచనా వేసింది. 1953–2021 మధ్య దేశంలో వరదలు, భారీ వర్షాల కారణంగా లక్షలాది ఇళ్లు, పంటలు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అసోంలో జూన్ చివరి నుంచి ఆగస్టు వరకు పలుమార్లు భారీ వర్షాలు కురిసి వరదలు, ఆకస్మిక వరదలు సంభవించాయి.
ఒక్క జూలై 18–21 మధ్య కురిసిన భారీ వర్షాలతో అసోంలో 16 జిల్లాలు, 794 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం ప్రాంతంలో 5 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అధ్యయనం పేర్కొంది. ఇటీవల హిమాలయాల్లో హిమానీనదం కూలిపోవడంతో నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు కూడా ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఎంత వేగంగా విస్తరించగలదో చూపించాయి. ఈ ఘటనలో సుమారు 1,400 మంది మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ఫ్లాష్‌ఫ్లడ్స్..
2024 అక్టోబర్‌లో స్పెయిన్‌లోని వాలెన్సియా ప్రాంతం ఫ్లాష్ ఫ్లడ్స్‌కు మరో ఉదాహరణ. టురిస్ ప్రాంతంలో కేవలం 16 గంటల్లో 771.8 మి.వీు.వర్షం నమోదైంది. ఒక గంటలో 184.6 మి.మీ. వర్షం కురిసి స్పెయిన్ జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. ఈ వరదల్లో 230 మంది మరణించారు. 2026లో ప్రచురితమైన ‘నేచర్ కమ్యూనికేషన్స్’ అధ్యయనం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి పెరిగితే వర్ష తీవ్రత సుమారు 20 శాతం పెరుగుతున్నట్లు అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం.. 1.81 బిలియన్ల మంది (ప్రపంచ జనాభాలో సుమారు 23 శాతం) వరదలకు ప్రత్యక్షంగా గురయ్యే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిలో 89 శాతం మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు.


