ఎస్‌ఐ కొట్టడంతో నాగేంద్రకు గాయమైన దృశ్యం
వైఎస్సార్‌సీపీ భాకరాపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జిని స్టేషన్‌కు పిలిచి చావబాదిన ఎస్‌ఐ
డీజే సౌండ్ తగ్గించమనడమే కారణం!
సాక్షి టాస్క్ ఫోర్స్ : చంద్రబాబు పాలనలో సామాన్యులు, దళితులపై పోలీసుల ఆగడాలు ఆగడంలేదు. ఇప్పటికే పోలీసుల దాష్టీకానికి పలువురు బలై పోగా, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు వారిపై లాఠీలు కరాళ నృత్యం చేస్తున్నాయి. తాజాగా దళిత యువకుడు, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా భాకరాపేట ఇన్‌ఛార్జి నాగేంద్రను పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించారు. ఈ దారుణంపై స్థానికులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
బాధితుడి కథనం ప్రకారం.. ఆదివారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేటలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే శబ్దాలకి నాగేంద్ర స్నేహితుడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే అతన్ని నాగేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి ఎందుకంత సౌండ్ పెట్టారని నిర్వాహకులను అడగడంతో మాటామాటా పెరిగి పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరిగింది. పోలీసులు సర్దిచెప్పి పంపేశారు. బుధవారం మధ్యాహ్నం నాగేంద్రకు పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఎస్సై కృష్ణయ్య పిలుస్తున్నారని చెప్పారు.
నాగేంద్ర పోలీసు స్టేషన్‌కు వెళ్లగానే ఎస్సై అతని సెల్ ఫోన్‌ని లాక్కున్నారు. ఆ వెంటనే రూమ్‌లోకి ఈడ్చుకెళ్లి చావబాదారు. ఎందుకు కొడుతున్నారని నాగేంద్ర అడగడంతో లాఠీతో మరింత తీవ్రంగా కొట్టారు. ఇలా దళిత యువకుడిని అకారణంగా హింసిండాన్ని దళిత సంఘాలు ఖండించాయి. కేవలం డీజే సౌండ్ తగ్గించమన్నందుకే కొట్టడం పోలీసుల దమన కాండకు నిదర్శనమని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, దళిత యువకుడిని హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
‘స్టేట్‌మెంట్’తో దిద్దుబాటు యత్నం?
కాగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా బాధితుడిపై ఒత్తిడి తెచ్చి, పోలీసులకు అనుకూలంగా మాట్లాడేలా స్టేట్‌మెంట్ రికార్డు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్ స్వచ్ఛందంగానే ఇచ్చారా? లేక పోలీసుల ఒత్తిడితో రికార్డు చేశారా? అనే అంశంపైనా ఉన్నతాధికారులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


