‘లాకప్‌’లో చిక్కుకున్న ఖాకీ! | Supreme Court gives a strong shock to the police in the Sai Krishna case | Sakshi
Sakshi News home page

‘లాకప్‌’లో చిక్కుకున్న ఖాకీ!

Sep 24 2026 4:34 AM | Updated on Sep 24 2026 4:34 AM

Supreme Court gives a strong shock to the police in the Sai Krishna case

సుప్రీంకోర్టు హెచ్చరికలతో పోలీసు బాసుల్లో తీవ్ర ఆందోళన   

సాయికృష్ణ అక్రమ నిర్బంధం డీజీపీ, పోలీసు కమిషనర్‌కు పక్కాగా తెలుసు

సాయికృష్ణను గతంలోనే టార్గెట్‌ చేసిన పోలీసులు 

అందుకే మార్కాపురం వెళ్లి మరీ సాయికృష్ణను పట్టుకొచ్చారు 

విజయవాడ కమిషనర్‌ కంట్రోల్‌లోనే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  

మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారు 

కొట్టి చంపి ఉన్నతాధికారుల సూచనలతోనే తగలబెట్టేశారు..

సీసీటీవీ ఫుటేజీ తొలగించాలంటే కమిషనర్‌ అనుమతి తప్పనిసరి 

అనుమతి లేకుండా తొలగిస్తే పడే శిక్ష ఏంటో పోలీసులకు బాగా తెలుసు 

తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుపై స్పందించని డీజీపీ 

మే 28న ఫిర్యాదు ఇస్తే.. జూన్‌ 19న కేసు నమోదు 

హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారు.. 

బైటపడేందుకే సొంత టీమ్‌తో అప్పటికప్పుడు సిట్‌ ఏర్పాటు

సాక్షి, అమరావతి: కాపు యువకుడు సాయికృష్ణను చంపేసి.. మృతదేహాన్ని కాల్చేసి.. చితాభస్మం కూడా లేకుండా చేసిన కేసులో నేరాన్ని కిందిస్థాయి అధికారులపై నెట్టేసి తప్పించుకుందామనుకున్న రాష్ట్ర డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. వారి పాత్రపై నిగ్గు తేలుస్తామని, సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో నిజానిజాలను వెలుగులోకి తెస్తామని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు ఈ ముగ్గురు ఉన్నతాధికారులకు వణుకుపుట్టిస్తున్నాయి. లాకప్‌డెత్‌ కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం వీరికి చెమటలు పట్టిస్తోంది. ఎక్కడ సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 

కస్టడీలోకి తీసుకున్న వ్యక్తిని దారుణంగా కొట్టి చంపడమే కాకుండా, శవం కూడా కనిపించకుండా దహనం చేసిన వ్యవహారం ఈ ముగ్గురు ఉన్నతాధికారులకు ముఖ్యంగా విజయ­వాడ కమిషనర్‌ రాజశేఖర్‌బాబుకు తెలియకుండా జరిగే అవకాశమే లేదని పోలీసు శాఖలోనే చెబుతున్నారు. ఒక వ్యక్తి­ని కస్టడీలోకి తీసుకుని, అక్రమంగా నిర్బంధిస్తే, ఆ విషయా­న్ని కింది స్థాయి అధికారులు తప్పనిసరిగా ఉన్నతాధికారుల­కు తెలియచేయాలి. రోజూ ఇలా ఎంత మందిని కస్టడీలోకి తీ­సుకుని నిర్భంధించారో ప్రతి ఉదయం జరిగే ఉన్నతాధికారు­ల అంతర్గత సమీక్షలో చర్చిస్తారు. ఇన్‌స్పెక్టర్‌ నుంచి మొదలై, అంతిమంగా డీజీపీ వరకు ఈ సమాచారం వెళుతుంది. సాయికృష్ణను కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ అక్రమంగా నిర్బంధించిన విషయం ఈ ముగ్గురు ఉన్నతాధికారులకు స్పష్టంగా తెలుసు.  

కమిషనర్‌ అనుమతి లేకుండా ఏ పనీ చేయరు 
విజయవాడ పోలీసుల వేధింపులు తట్టుకోలేక మార్కాపురం వెళ్లి పెయింట్‌ పనులు చేసుకుంటున్న సాయికృష్ణను పట్టుకురావడానికి స్థానిక పోలీసులు కాక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఏ పనీ చేయరు. విజయవాడలో టాస్‌్కఫోర్స్‌ పోలీసులు విజయవాడ కమిషనర్‌ కంట్రోల్‌లో ఉంటారు. ఆయనకు తెలియకుండా, ఆయనకు చెప్పకుండా ఏ పనీ చేసే అవకాశమే లేదు. ఈ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సివిల్‌ డ్రస్సుల్లోనే తిరుగుతూ పోలీసు బాసు­లు చెప్పే ‘అనధికార పనులు’ చేస్తుంటారు. 

ఇందులో భాగంగానే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ అమలు సాకుతో టాస్‌్కఫోర్స్‌ పోలీసులు సాయికృష్ణను పట్టుకొచ్చారు. నిబంధనల ప్రకారం వెంటనే అతన్ని మేజిస్ట్రేట్  ముందు హాజరుపరచాలి.. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణలంక సీఐ నాగరాజు అక్రమంగా తమ నిర్బంధంలో ఉంచారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతో తట్టుకోలేక సాయికృష్ణ చనిపోయాడు. ఈ లాకప్‌డెత్‌ ఎక్కడ మెడకు చుట్టుకుంటుందోనన్న భయంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు సాయికృష్ణ మృతదేహాన్ని తగలబెట్టేశారు.  

సీపీకి తెలియకుండా ఫుటేజీ తొలగింపు సాధ్యంకాదు
ముందుగా సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక స్టేషన్‌కు తీసుకొచ్చిన మొదలు, కొట్టి చంపేసి, శవాన్ని తరలించి బూడిద చేసే వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజీలను తొలగించేశారు. పోలీసు పెద్దల సహాయ, సహకారాలు లేకుండా సీసీటీవీ ఫుటేజీ మాయమయ్యే అవకాశమే లేదు. నిబంధనల ప్రకారం సీసీటీవీ ఫుటేజీని డిలీట్‌ చేయాలంటే జిల్లాల్లో ఎస్‌పీ, కమిషనరేట్‌లలో కమిషనర్‌ అనుమతి తప్పనిసరి. ఏ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)కు కూడా సీసీటీవీ ఫుటేజీని డిలీట్‌ చేసేందుకు అనుమతి ఉండదు. డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌), నెట్‌వర్క్‌ వీడియో రికార్డర్‌ (ఎన్‌వీఆర్‌)లలో నిక్షిప్తయ్యే సీసీటీవీ ఫుటేజీని తొలగించాలంటే ఎస్‌పీ లేదా కమిషనర్‌ నుంచి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు అనుమతి లేకుండా సీసీటీవీ ఫుటేజీ తొలగింపు ఎలా సాధ్యమైంది?

ఏకంగా నెల రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మాయం చేయడం కింది స్థాయి పోలీసులకు సాధ్యమేనా? అనుమతులు లేకుండా పోలీసులు నేరుగా సీసీటీవీ ఫుటేజీని డిలీట్‌ చేయడం చట్టరీత్యా తీవ్ర నేరం. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లేదా ఐపీసీ సెక్షన్ల ప్రకారం, కేసు దర్యాప్తుకు సంబంధించిన డిజిటల్‌ సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా తొలగించడం అనేది నాన్‌–బెయిలబుల్‌ నేరం. ఫుటేజ్‌ డిలీట్‌ చేసినట్లు రుజువైతే పోలీసు అధికారులను సర్వీస్‌ నుండి సస్పెండ్‌ చేయడం, డిస్మిస్‌ చేయడంతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా కింది స్థాయి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని మాయం చేశారంటే వారికి ఉన్నతాధికారుల సహకారం ఉన్నట్లే లెక్క.  

డీజీపీ స్పందించి ఉంటే బతికేవాడు... 
పోలీసులందరికీ బాస్‌ అయిన డీజీపీ కూడా సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అతన్ని అక్రమంగా నిర్భంధించిన విషయాన్ని అంతర్గత సమీక్షా సమావేశంలో తెలుసుకున్న వెంటనే స్పందించి ఉంటే సాయికృష్ణ బతికి ఉండేవారు. పోలీసులు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమీక్షా సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై చర్చిస్తారు. అందులో అక్రమ నిర్బంధాలు కూడా చర్చకు వస్తాయి. అలాగే సాయికృష్ణ అక్రమ నిర్బంధం కూడా డీజీపీ దృష్టికి వచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో అక్రమ నిర్భంధాలు సర్వసాధారణమైపోయిన నేపథ్యంలో పోలీసు బాసే దానిని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో సాయికృష్ణ అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యాడు. ఆ తరువాతైనా డీజీపీ స్పందించారా? అంటే అదీ లేదు. 

సాయికృష్ణ తల్లి తన కుమారుడి ఆచూకీ కోసం ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు పంపితే ఆయన కనీస స్థాయిలో కూడా స్పందించలేదు. మే 28న ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో అప్పుడు డీజీపీ స్పందించారు. ఆయన చెప్పిన తరువాతనే పోలీసులు జూన్‌ 19న కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఆమె కుమారుడి ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అందులో డీజీపీ కూడా పార్టీగా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా ఆయన స్పందించలేదు. కోర్టుకు వాస్తవాలు చెప్పలేదు. సాయికృష్ణ మా ఆ«దీనంలో లేడని, ఆ చూకీ తెలియడం లేదని కోర్టును తప్పుదోవ పట్టించారు. ఇదే సమయంలో సాయికృష్ణ తల్లి సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. 

పోలీసు బాసుల ఒత్తిడి మేరకు అప్పటికప్పుడు సిట్‌ 
సాయికృష్ణను పోలీసులే కొట్టి చంపేశారన్న విషయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది. దీంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.  దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సాయికృష్ణ లాకప్‌డెత్‌పై హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు డీజీపీ, పోలీస్‌ కమిషనర్‌ తదితరుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం అప్పటికప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌లోని పోలీసులు తమ కింద పనిచేసే వారే కాబట్టి సమస్య ఉండదన్న ఉద్దేశంతో పోలీసులు సిట్‌ వేయించారు. ఆ వెంటనే సిట్‌ వరుస అరెస్ట్‌లు చేసింది. కృష్ణలంక సీఐ నాగరాజుతో పాటు కానిస్టేబుళ్లను, హోంగార్డును అదుపులోకి తీసుకుంది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని, తనను అన్యాయంగా ఇరికించారని నాగరాజు మీడియా ముఖంగా వాపోయారు. ఓ దశలో పోలీసుల నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

హైకోర్టు, సుప్రీంకోర్టు భయంతో హడావుడిగా చార్జిషీట్‌ 
ఇదే సమయంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌తో పాటు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు సీరియస్‌గా విచారణ మొదలు పెట్టింది. విజయలక్ష్మీ ఎప్పుడో పిటిషన్‌ దాఖలు చేస్తే ఇప్పటి వరకు కౌంటర్‌ దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. లాకప్‌డెత్‌ చాలా తీవ్రమైన వ్యవహారమని స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంది. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యమూ విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ముగ్గు­రు అధికారులు ఆందోళన చెందారు.

దర్యాప్తు పెండింగ్‌లో ఉంటే అటు హైకోర్టు గానీ, ఇటు సుప్రీంకోర్టు గానీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉండటంతో, వెంటనే దర్యాప్తునకు ముగింపు పలకాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సిట్‌కు మార్గదర్శనం చేసి కింది కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయించారు. మంగళవారం జరిగిన విచారణలో పోలీ­సులు ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్టు ఈ చార్జిషీట్‌ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విజయలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్లలో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా బుధవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు విజయలక్ష్మీ దాఖలు చేసిన వ్యాజ్యాల స్థితిగతులను కోరడం విశేషం.

తమిళనాడు కోర్టే కరెక్ట్‌... 
ఓ పౌరుడిని అత్యంత క్రూరంగా హింసించి చంపి మృతదేహాన్ని తగలబెట్టి చితాభస్మం కూడా లేకుండా చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌లు సోషల్‌ మీడియాలో రోజురోజు కు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని సాతాన్‌కుళం పోలీసుల విషయంలో తమిళనాడు కోర్టు అనుసరించిన విధానాన్నే ఇక్కడా అనుసరించాలని నెటిజెన్లు కోరుతున్నారు. తమిళనాడులో జయరాజ్‌–బెన్నిక్స్‌ అనే తండ్రీకొడుకులను లాకప్‌డెత్‌ చేసిన 9 మంది పోలీసులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement