విజయవాడ: డీఎస్సీ ధర్నాలో పాల్గొన్న వారిపై ఇటీవల మాచవరం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 30 మందిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టగా 28 మందికి బెయిల్ మంజూరు కాగా, మరో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించింది. బెజవాడ రాజశేఖర్, కలసాని చెన్నారావుకు రిమాండ్ విధించింది కోర్టు.
అడ్వకేట్ ఒగ్గు గవాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘న్యాయం గెలిచింది. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ సెక్షన్లు పెట్టారు. కోర్ట్ ఈ సెక్షన్లు వర్తించవని చెప్పింది. 30 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే 28 మందికి బెయిల్ వచ్చింది. మరో ఇద్దరికి పాత కేసుల నేపథ్యంలో రిమాండ్ వేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలి. అడ్వకేట్స్ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నారు. న్యాయబద్ధంగా కోర్టుల్లో కూటమి కక్ష సాధింపులపై పోరాటం చేస్తాం’’ అని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు మద్దూకూరి సాయిబాబు మాట్లాడుతూ... ‘‘అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేసారో కూడా చెప్పకుండా పోలీసులు నందిగామ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. శాంతియుత ధర్నా చేస్తే అక్రమ కేసు పెట్టారు. నిన్న అరెస్ట్ చేసిన వాళ్లకు కనీసం ఫుడ్, వాటర్ ఇవ్వలేదు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ లు చేసి బయపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు అరెస్టులకు భయపడరు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం విధానాలను ప్రజల ముందు పెడతాం’’ అని తెలిపారు.
ఏం జరిగింది?
ఏపీలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్న విషయం విదితమే. తాజాగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్లీ అక్రమ అరెస్టులు జరిగాయి. విజయవాడలో జరిగిన డీఎస్సీ ఆందోళనలో పాల్గొన్న మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేశారు. అనంతరం విచారణకు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు దీనిపై మాట్లాడుతూ.. అక్రమంగా తమ నాయకులను అరెస్ట్ చేశారంటూ పోలీసుల చర్యలను తప్పు పట్టారు.


