దండయాత్ర! | - | Sakshi
Sakshi News home page

దండయాత్ర!

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

సామాన్యుడిపై ధరల దండయాత్ర! ఏం కొనాలి.. ఏం తినాలి? ఘాటెక్కుతున్న ఉల్లి.. వెల్లుల్లి

సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ కుదేలు నిత్యావసరాలు, కూరగాయల ధరలకు రెక్కలు కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.90, రూ.300 దాటిన వెల్లుల్లి పరుగులు పెడుతున్న బెల్లం, పంచదార రేట్లు రేషన్‌ దుకాణాల్లో పంచదారను కాజేస్తున్న డీలర్లు

సామాన్యుడిపై ధరల
ఏం కొనాలి.. ఏం తినాలి?

సాక్షి, విజయవాడ: రోజంతా కష్టపడితే వచ్చే కూలి.. నెలంతా కష్టపడితే వచ్చే జీతంతో కుటుంబ పోషణ కష్టతరమవుతోంది.. ఇంటి బాడుగ, నిత్యావసరాలకే వచ్చిన అరకొర వేతనం సరిపోతే.. ఇక పిల్లల చదువులు, ఇతరత్రా వాటికి ప్రతి నెలా అప్పు చేయాలి. మరోవైపు ధరలు.. రోజు రోజుకూ మరింత పెరగడమే తప్పా.. తగ్గడమే లేదు. ఉప్పు నుంచి పప్పు వరకు, నూనెలు, బియ్యం, కూరగాయలు, ఉల్లి, వెల్లుల్లి.. ఏది కొనాలన్నా నెలవారీ కుటుంబ బడ్జెట్‌ అంచనాకు మించుతోంది. ఈ ధరల దండయాత్రతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబే లెత్తుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతోంది.

ప్రతి నెలా భారం తప్పట్లేదు..

రెండు, మూడు నెలల క్రితం వరకు మేలు రకం సన్నబియ్యం కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య ఉండేది. గత నాలుగైదురోజుల్లోనే కొన్ని రకాల బియ్యం ధర కేజీ రూ.70 దాటింది. ఈ లెక్కన గమనిస్తే కిలోపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది. నెలకు 20 నుంచి 25 కిలోల బస్తా కొనుగోలు చేసే సామాన్యులపై రూ.400 నుంచి రూ.550 వరకూ అదనపు భారం పడుతోంది. దీనికి తోడు మిల్లర్లు, వ్యాపారులతో కుమ్మకై ్క ధరలు పెంచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రైతు బజార్లలో సన్నబియ్యం అందిస్తున్నామని చెబుతున్నా.. వాస్తవంగా రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యమే విక్రయిస్తుండటంతో ప్రజలు కొనుగోలు చేయట్లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బియ్యం నిల్వలన్నీ కూడా గతేడాదివే. బియ్యం ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామని తరచూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. వీరి వెనుక కూడా ఎన్టీఆర్‌ జిల్లాలో బియ్యం మాఫియా నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

పంచదార, బెల్లం మరింత ప్రియం..

రెండు నెలల కిందట కిలో పంచదార రూ.40 నుంచి రూ.45 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.70 నుంచి రూ.75 వరకు చేరడంతో సామాన్యులు కొనలేక ఆలోచించాల్సిన పరిస్థితి. కొందరు వ్యాపారులు చక్కెరను గౌడౌన్లలో నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు జనరల్‌ స్టోర్లు, బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు రేషన్‌ దుకాణాల్లో రాయితీపై అందించే పంచదారను డీలర్లే బొక్కేస్తున్నారని, యంత్రంలో శబ్దం రాకుండా సెట్టింగ్స్‌ మార్చుకుని, కార్డుదారుల వేలిముద్రలు వేసుకుని, పంచదార ఇవ్వకుండానే, ఇచ్చినట్లు చూపుతూ కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బెల్లం ధర కూడా పెరిగింది. కొద్దిరోజుల క్రితం కిలో రూ.55 నుంచి రూ.60 మధ్య ఉన్న బెల్లం ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. ప్యాకింగ్‌ చేసిన బెల్లం అయితే పలు సూపర్‌ మార్కెట్లలో, కొన్ని పేరున్న మార్ట్‌లలో కిలో రూ.90కు విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో అన్నింటి కంటే ఉల్లి, వెల్లుల్లి ధరలు గత నాలుగైదురోజుల్లోనే కిలోపై రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగాయి. మహారాష్ట్ర లోని నాసిక్‌, కర్నూలులో ఉల్లి దిగుమతి ఉంటుంది. అయితే ఈసారి తీవ్ర వర్షాభావం కారణంగా దిగుమతి లేదు. ఈ ఏడాది జూలైలో కిలో రూ.20–25 మధ్య ఉన్న ఉల్లి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో, తోపుడు బండ్ల మీద ఏకంగా రూ.80 నుంచి రూ.90 వరకు ఉంటోందని గాంధీనగర్‌ రైతు బజారులో కూరగాయ లు కొనడానికి వచ్చిన పలువురు మహిళలు వాపోయారు. మరోవైపు ప్రభుత్వ పెద్దలు, అధికారులు రైతుబజార్ల ద్వారా రూ.32కే కిలో ఉల్లి అందుబాటులోకి తెస్తామని చెబుతున్నా.. వాస్తవానికి రైతుబజార్లలో ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం తెప్పిస్తున్న ఉల్లి కుళ్లిపోయిన, నాసిరకంగా ఉంటోందని వాపోతున్నారు. నాణ్యమైన ఉల్లిని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిలో ఉల్లి కొంటే 20 శాతం కుళ్లిన గడ్డలే ఉంటున్నాయని మహిళలు వాపోయారు. రెండు నెలల క్రితం కిలో వెల్లుల్లి సుమారు రూ.140 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.300 దాటింది. నాణ్యత, గ్రేడింగ్‌ ఆధారంగా కొన్ని దుకాణాల్లో రూ.300కు పైగా కూడా విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. అలాగే కిలో ఎండు మిర్చి ధర రూ.300కు చేరింది. ఇక వంట నూనెల ఽ దరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బ్రాండెడ్‌ వంట నూనె కిలో రూ.160 నుంచి రూ.170 మధ్య లభించగా.. ప్రస్తుతం రూ.185 నుంచి రూ.210 వరకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement