యూపీని నాలుగు భాగాలు చేస్తామన్న మంత్రి, కూటమిలో కలకలం | Uttar Pradesh To Be Divided Into 4 Parts Ministers Remarks Reignite Debate | Sakshi
Sakshi News home page

యూపీని నాలుగు భాగాలు చేస్తామన్న మంత్రి, కూటమిలో కలకలం

Sep 23 2026 3:22 PM | Updated on Sep 23 2026 3:47 PM

Uttar Pradesh To Be Divided Into 4 Parts Ministers Remarks Reignite Debate

సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్, కుల గణన తర్వాత రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తామని ప్రకటించడం సంచలన రేపింది. యూపీని విభజించాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత రాజ్‌భర్  తాజా వ్యాఖ్యలతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రాన్ని విభజించాలనే దాదాపు రెండు దశాబ్దాల నాటి చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ను బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, అవధ్ ప్రదేశ్ ,పశ్చిమ్ ప్రదేశ్ అనే నాలుగు కొత్త రాష్ట్రాలుగా విభజించాలనే ప్రతిపాదనను రాజ్‌భర్ పదేపదే వినిపిస్తున్నారు. కులగణన తర్వాత రాష్ట్ర విభజన జరగవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చార న్నారు. సెప్టెంబర్ 20న డియోరియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్వాంచల్ ఏర్పడిన రోజున ముఖ్యమంత్రి పదవి రాజ్‌భర్ కుమారుడికే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కూటమిలో భిన్నాభిప్రాయాలు
యూపీలో అధికారంలో ఉన్న బీజేపీతో SBSP పొత్తులో ఉన్న సంగతి  తెలిసిందే. రాజ్‌భర్‌ వ్యాఖ్యలో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ముఖ్యంగా బీజేపీ మిత్రపక్షమైన అధినేత సంజయ్ నిషాద్ రాజ్‌భర్ వ్యాఖ్యలను ఖండించారు. తమ పార్టీ అటువంటి విభజనకు అనుకూలంగా లేదని చెప్పారు. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యాఖ్యలని కొట్టిపారేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదని తెలిపారు. మరోవైపు  బీజేపీ నేత సంజీవ్ బల్యన్ మాత్రం రాజ్‌భర్ వ్యాఖ్యలను సమర్థించారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ప్రజలకు త్వరితగతిన న్యాయం, మెరుగైన వైద్యం (AIIMS) అందుతాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : పక్కింటి వైఫై సాయం : స్లమ్‌ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్‌

సమాజ్‌వాదీ పార్టీ  ఏమందంటే
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, సీనియర్ నేత శివపాల్ యాదవ్ ఈ విభజన డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశాన్ని, రాష్ట్రాలను విడగొట్టాలని చూసేవాళ్ళు దేశాన్ని కూడా విభజించాలనుకుంటారని అఖిలేష్ మండిపడ్డారు. చిన్న రాష్ట్రాల వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని శివపాల్ యాదవ్ పేర్కొన్నారు.

కాగా 2000 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ విడిపోయింది. ఆ తర్వాత 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి ముఖ్యమంత్రి మాయావతి కూడా ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు భాగాలుగా విభజించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. అప్పట్లో పాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసమే ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. భారతదేశంలో ప్రస్తుతం రెండు దశల్లో జనాభా గణన జరుగుతోంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement