లండన్: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2026 అవార్డుకు తుది జాబితా (షార్ట్‌లిస్ట్) విడుదలైంది. మొత్తం 163 నవలలను పరిశీలించిన ఐదుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం ఆరు పుస్తకాలను తుది పోటీకి ఎంపిక చేసింది. ఈ జాబితాలో గతంలో బుకర్ ప్రైజ్ గెలిచిన ఇద్దరు రచయితలతో పాటు ఓ 81 ఏళ్ల సీనియర్ రచయిత, ఓ ప్రముఖ అమెరికన్ నవలా రచయిత, తొలిసారి షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ముగ్గురు రచయితలు ఉన్నారు.
ఈ ఏడాది జడ్జింగ్ ప్యానెల్‌కు రచయిత్రి, చరిత్రకారిణి మేరీ బియర్డ్ అధ్యక్షత వహించారు. రేమండ్ ఆంట్రోబస్, జార్విస్ కాకర్, రెబెక్కా లియు, ప్యాట్రిషియా లాక్‌వుడ్ సభ్యులుగా ఉన్నారు. ఎంపికైన నవలలు హాస్యభరితమైనవి, ఆశ్చర్యపరిచేవి, నిశ్శబ్దంగా ప్రభావం చూపేవి అంటూ జడ్జింగ్ ప్యానెల్ అభివర్ణించింది.
81 ఏళ్ల రచయితకు అరుదైన అవకాశం
ఎం జాన్ హారిసన్ రాసిన ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్’ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. భవిష్యత్‌లో ప్రపంచం ఎలా మారుతుందనే నేపథ్యంలో కెంట్ తీర ప్రాంతాన్ని వేదికగా చేసుకున్న ఈ నవలలో సైన్స్ ఫిక్షన్, వ్యంగ్యం, మిస్టరీ తదితర అంశాలు కలగలిసి ఉంటాయి. 81 ఏళ్ల హారిసన్ బుకర్ ప్రైజ్ గెలిస్తే.. ఈ అవార్డు అందుకున్న అత్యధిక వయసు కలిగిన విజేతగా రికార్డు సృష్టించనున్నారు.
మరోసారి బుకర్ బరిలో మార్లోన్ జేమ్స్
మార్లోన్ జేమ్స్ ‘ది డిసెప్పియరర్స్’ నవలతో మరోసారి బుకర్ ప్రైజ్ తుది జాబితాలో నిలిచారు. 1980ల చివరి, 1990ల ప్రారంభంలో జమైకాలోని స్వలింగ సంపర్క పురుషుల జీవితాలను ఈ నవల వివరిస్తుంది. ఆ కాలంలోని స్వలింగ సంపర్కులపై వివక్ష, ఎయిడ్స్ మహమ్మారి, రెగే, డ్యాన్స్‌హాల్ సంస్కృతి వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. జేమ్స్ 2015లో ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు.
ఇదీ చదవండి: 360 డిగ్రీల అద్భుత ‘స్కైడోమ్’.. చూసి తీరాల్సిందే!


