అల్కరాజ్‌ను ఓడించినోడు ఫైనల్‌కు; 23 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా? | US Open: Shelton Enter-1st Grand Slam Final-Will-Break 23 Years Record | Sakshi
Sakshi News home page

అల్కరాజ్‌ను ఓడించినోడు ఫైనల్‌కు; 23 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా?

Sep 12 2026 12:09 PM | Updated on Sep 12 2026 12:20 PM

US Open: Shelton Enter-1st Grand Slam Final-Will-Break 23 Years Record

Photo Credit: US Open Twitter

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికాకు చెందిన బెన్ షెల్ట‌న్ తొలిసారి ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. భార‌త కాల‌మాన ప్ర‌కారం శ‌నివారం తెల్ల‌వారుజామున పురుషుల సింగిల్స్ సెమీఫైన‌ల్లో బెన్ షెల్ట‌న్ 4-6, 6-3, 6-3, 7-5తో త‌న దేశానికే చెందిన ఫ్రాన్సెస్ టియాఫోను మ‌ట్టిక‌రిపించాడు. తొలి సెట్‌ను ఓట‌మితో ప్రారంభించిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత ఫుంజుకున్న షెల్ట‌న్ రెండు వ‌రుస సెట్ల‌లో విజ‌యాన్ని అందుకున్నాడు. 

ఇక నాలుగో సెట్‌లో ఇరువురు హోరాహోరీగా త‌ల‌ప‌డిన‌ప్ప‌టికీ, చివ‌ర‌కు షెల్ట‌న్‌నే విజ‌యం వ‌రించింది. రేపు జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ అలెగ్జాండ‌ర్ జ్వెరెవ్‌తో షెల్ట‌న్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. క్వార్ట‌ర్స్‌లో అల్క‌రాజ్‌ను చిత్తు చేసిన షెల్ట‌న్ సెమీస్‌లోనూ టియాఫోపై అదే జోరును ప్ర‌ద‌ర్శించి విజ‌యం అందుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేర‌డమే షెల్ట‌న్‌కు అత్యుత్త‌మంగా ఉండేది. 

తొలి బ్లాక్‌ అమెరికన్‌గా
తాజాగా ఆ రికార్డును స‌వ‌రించిన షెల్ట‌న్ టైటిల్ అందుకోవ‌డానికి అడుగు దూరంలో నిలిచాడు. 1972 త‌ర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైన‌ల్ చేరిన తొలి బ్లాక్ అమెరిక‌న్‌గా బెన్ షెల్ట‌న్ రికార్డుల‌కెక్కాడు. అంతేకాదు షెల్ట‌న్ టైటిల్ సాధిస్తే మ‌రో రికార్డు కూడా అందుకోనున్నాడు. ఆండీ రాడిక్ (2003) త‌ర్వాత యూఎస్ ఓపెన్ గెలిచిన అమెరిక‌న్‌ ప్లేయ‌ర్‌గా షెల్ట‌న్ నిల‌వ‌నున్నాడు. 

ఆనాటి యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో ఆండీ రాడిక్.. జువాన్ కార్లోస్ ఫెర్రోరోను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు. 23 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒక అమెరిక‌న్‌గా షెల్ట‌న్‌కు టైటిల్ గెలిచే అవ‌కాశ‌మొచ్చింది. ఇక మ్యాచ్ అనంత‌రం షెల్ట‌న్ మాట్లాడుతూ.. ఈ విజ‌యాన్ని త‌న నాన‌మ్మ‌కు అంకితం చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఆ త‌ర్వాత‌ 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల‌కు నివాళి అర్పించాడు. 

అమ్మమ్మకు అంకితం

"ఇది చాలా భావోద్వేగభ‌రిత‌మైన‌ది. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి మా అమ్మ‌, నాన్న చాలా త్యాగాలు చేశారు. ఈ ఏడాది నా త‌ల్లిని పోగొట్టుకున్నాను. నిజానికి ఆమె వ‌ల్ల ఇవాళ నేను టెన్నిస్ ఆడ‌గ‌లుగుతున్నా. ఆమె లేక‌పోయుంటే బెన్ షెల్ట‌న్ అనేవాడు ఇక్క‌డ ఉండేవాడు కాదేమో. ఇదంతా ఆమె కోస‌మే. విజ‌యాన్ని నాకెంతో ఇష్ట‌మైన‌ మా అమ్మ‌మ్మ‌కు అంకితం చేస్తున్నా." అని క‌న్నీటిప‌ర్యంత మ‌య్యాడు.

మ‌రో సెమీఫైన‌ల్లో ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ జ్వెరెవ్ 6-3, 7-6 (9-7), 7-6 (8-6)తో క‌చ‌నోవ్‌పై క‌ష్ట‌ప‌డి విజ‌యం సాధించాడు. జ్వెరెవ్ యూఎస్ ఓపెన్ ఫైన‌ల్ చేర‌డం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన జ్వెరెవ్ రెండో గ్రాండ్‌స్లామ్‌పై క‌న్నేశాడు. జ్వెరెవ్ చేతిలో షెల్ట‌న్ ఐదుసార్లు ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో షెల్ట‌న్ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా లేక జ్వెరెవ్‌కు దాసోహ‌మంటాడా అనేది చూడాలి.

 

చదవండి: శ్రీలంక జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్ ఎవ‌రో తెలీదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement