విరాట్‌ కోహ్లి ఊహించని నిర్ణయం! | Virat Kohli Set For Another Delhi Return? DDCA Chief Says India Star Will Definitely Play Again Ahead Of WC 2027 | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి ఊహించని నిర్ణయం!.. అందుకు సిద్ధంగానే?

Sep 12 2026 10:43 AM | Updated on Sep 12 2026 11:16 AM

Virat Kohli will definitely play for Delhi again In VJT: DDCA Chief

విరాట్‌ కోహ్లి (PC: DDCA X)

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యాలతో లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి ‘రన్‌మెషీన్‌’గా పేరొందాడు ఈ ఢిల్లీ ఆటగాడు. అయితే, 2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. గతేడాది టెస్టులకూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి.. ప్రపంచకప్‌-2027 ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా 54 శతకాలు బాదిన కోహ్లి.. చెక్కు చెదరని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

గతేడాది దేశీ క్రికెట్‌ బరిలో..
అయితే, 37 ఏళ్ల కోహ్లి వయసు రిత్యా, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్న సెలక్టర్లు.. ప్రపంచకప్‌ టోర్నీలో ఆడకుండా అతడిని పక్కనపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బీసీసీఐ నిబంధనల ప్రకారం.. కోహ్లి గతేడాది దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు ఢిల్లీకి ఆడి తన బ్యాటింగ్‌లో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆంధ్రపై శతక్కొట్టిన (131) ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మరో మ్యాచ్‌లో అర్ధ శతకంతో అలరించాడు.

మరోసారి కింగ్‌ ఆడతాడు!
ఇక ప్రస్తుతం ఐపీఎల్‌, వన్డేల్లో మాత్రమే ఆడుతున్నందున కోహ్లికి ఎక్కువగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా అతడు మరోసారి దేశీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడతాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం గురించి ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (DDCA) అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ ఇండియా టుడేతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ అతడి సొంత అసోసియేషన్‌. కోహ్లి ఎప్పుడు వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయి. ఈ జట్టు అతడికి చెందినది. సొంత జట్టు తరఫున ఆడాలనే నిబద్ధత అతడిలో ఎప్పుడూ ఉంటుంది.

అంతర్జాతీయ విధుల నుంచి విరామం లభించిన సమయంలో కోహ్లి ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా మేము అతడిని స్వాగతిస్తాము. మరోసారి అతడు ఢిల్లీకి ఆడితే అంతకంటే మంచి విషయం ఇంకొకటి ఉండదు’’ అని రోహన్‌ జైట్లీ పేర్కొన్నాడు.

అభిమానులకు పండుగే
కాగా గతేడాది కోహ్లి ఢిల్లీ తరఫున ఆడగా.. ఎన్నడూ లేని విధంగా దేశీ మ్యాచ్‌ కోసం కూడా అభిమానులు ఎగబడ్డారు. కింగ్‌ ఆటను చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తడంతో మైదానం నిండిపోగా.. కొంతమంది చెట్లు ఎక్కి మరీ మ్యాచ్‌ను వీక్షించారు. ఇక మరోసారి కోహ్లి దేశీ బరిలో దిగితే అభిమానులకు పండుగేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీకి చుక్కలు చూపించిన బుమ్రా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement